సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి? భోగి, కనుమ, ముక్కనుమ పండుగలను ఎందుకు నిర్వహించుకుంటారు?
సంక్రాంతి ప్రగతిశీల ఔత్సాహికులను సైతం సంప్రదాయం వైపు మళ్లించే పండగ. పండుగలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సంప్రదాయం వైపు మొగ్గు చూపుతారు. అసలు అదే హిందూ పండుగల లక్ష్యంగా గోచరిస్తుంది. ఈ సంక్రాంతి రైతులకు ఎక్కువ అనందాన్ని కలిగిస్తుంది. కష్టపడి పండించిన పంట తమ ఇళ్లకి చేరే సమయం ఇది. ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేడం కొరకు ఇళ్ళ ముందు అందమైన రంగు ముగ్గులు దర్శనమిస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి పాటలు పాడతారు, కొందరు నృత్యాలు కూడా చేస్తారు. మకర సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి? భోగి, కనుమ, ముక్కనుమ పండుగలను ఎందుకు నిర్వహించుకుంటారు?
సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి? భోగి, కనుమ, ముక్కనుమ పండుగలను ఎందుకు నిర్వహించుకుంటారు?

మీకు వీడియో విధానంలో చూడాలనుకుంటే మన ఛానల్ లో వీక్షించండి: https://youtu.be/tO1y0oUN5io
సంక్రాంతి పండుగ సందడి…
మళ్ళీ గొబ్బెమ్మా సుఖములియ్యవే తామరపువ్వంటి తమ్ముణ్ణియ్యవే
చేమంతి పువ్వంటి చెల్లిల్నియ్యవే మొగలిపువ్వంటి మొగుణ్జియ్యవే
అని అమ్మాయిలు పాటలు పాడుకుంటూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సందడి చేస్తారు.
బంతి పూవులు లేత నవ్వులతో సంక్రాంతి సుందరి సాగివచ్చింది
తెలుగు పల్లెలు నిద్రలేచాయి వెలుగులో కనువిచ్చి చూచాయి.
ఇది ప్రాచీన జానపదులు పాడుకున్న పాట. నేటికీ ఆ పాట సంప్రదాయంగా సాగుతూనే వస్తోంది.
సంక్రాంతికి వచ్చే నెలరోజుల ముందునుంచే ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం జరుగుతుంటుంది. కనుమ రోజు రథం ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులు ఎవరు ఎంత పొడవుగా వేస్తారు అని పోటీలు కూడా పెట్టుకుంటూ వీధుల చివరిదాకా ముగ్గులు వేస్తారు. ఈ పోటీల్లో సరదాలు, సృజనాత్మకత ఇమిడి ఉన్నాయి. ఆ రోజున కమతాగాళ్ళకు ఏడాదికి సరిపడి ధనధాన్యాలను లభిస్తాయి.
ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయాలు ఎక్కువగా పాటించకపోయినా కనుమరుగు మాత్రం కాకపోవడం విశేషం. ఇప్పటికీ పల్లెటూర్లలో హరిదాసులు ఇంటింటికీ వెళ్తూ హరి కథలు పాడుతుంటారు. జానపదులకి ఈ పండుగ చాలా ముఖ్యమైనది. సంక్రాంతి పండుగ వేడుకల్లో చెప్పుకోదగిన మరొకటి గంగిరెద్దుల ఆట. ఈ సంప్రదాయం నేడు పట్టణ ప్రాంతాలలోనూ కనబడుతూనే ఉంది. ఇది అతి ప్రాచీనమైన కళగా భావిస్తారు.

మకర సంక్రాంతి పండుగ ఇలా వస్తుంది…
మకర సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత శాస్త్రపరంగా చాలానే ఉంది. నక్షత్రాలు 27 ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడి ఉన్నాయి. తిరిగి ఆ 108 పాదాలని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకి ఒక రాశిలో ప్రవేశిస్తుంటాడు. కనుక సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి సంక్రాంతిగా పరిగణించబడుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు.
సూర్యుడు ప్రాణాధారమైనవాడు. సూర్యుని యొక్క కాంతితో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఒకరు శక్తి, మరొకరు పదార్ధము. మనస్సుకు కారకుడు చంద్రుడు. చంద్రుడు కర్కాటక సంక్రమణంలో ప్రవేశిస్తే అది దక్షిణాయనం. ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి, పడమరకు అధిపతి వరుణుడు. ఈ ఇద్దరి వాహనాలు ఐరావతము, మకరము. యోగశాస్త్ర ప్రకారం మన శరీరంలో షట్బక్రముల్లోని మూలాధారం వద్ద ఏనుగు అనగా ఐరావతము ఉంటుంది.
సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం మొదలు, కర్కాటక రాశిలో ప్రవేశించేవరకు దేవతలందరికి పగలుగా ఉంటుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ధనుస్సు రాశిలో ప్రవేశించేంత వరకు దేవతలకు రాత్రి సమయంగా వ్యవహరిస్తారు. ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది కనుకనే వాళ్ళకి పగటి కాలంలో యజ్ఞయాగాదుల చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందమని సూచిస్తారు.

మకర సంక్రాంతి యొక్క విశిష్టత…
మకర సంక్రాంతి ఎంతో పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం మరియు ఉత్తమ లోకప్రాప్తిని కలిగించేది. మన ఇతిహాసాల్లో ముఖ్యంగా మహాభారతాన్ని చూస్తేగనక భీష్ముడు మార్గశిర మాసంలో శయ్య మీదకి చేరుకున్నా సరే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు చూసి, ఉత్తరాయాణం ప్రవేశించాక తనకు మోక్షం కలిగించమని ఆ పరందామున్ని వేడుకున్నాడు. శయ్య మీద వున్నా సరే తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకి రాజనీతి బోధించి తన విశిష్టతనీ చాటుకున్నాడు.
సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటికి నుంచి ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. సంక్రాంతి నెల రోజులూ ఇళ్ళ ముందు రంగు ముగ్గులు తీర్చిదిద్దుతారు. ఇలా ఇళ్ళ ముందు ముగ్గులు పెట్టడం అత్యంత ప్రాచీనమైన హైందవ సంప్రదాయం.
॥ పూజాస్థాన విశుద్ధ్యర్ధం దోమయేన పూజయేల్ తతః పంచవిదై శ్చూర్జైరంగవల్లీం ప్రకల్పయేత్ ॥
(స్కాంద పురాణం)
అనగా సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించబడుతుంది. అందుకే అతి పవిత్రమైనది. హిందువులు అంతా పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు ఎంతో ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగల్లో సంక్రాంతి ప్రముఖస్థానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినం. భూగోళమందు కర్మాటక రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖలు ఉన్నాయి.
సూర్య భగవానుడు సప్త అశ్వాల ( ఏడు గుర్రాలు) మహారధం మీద ప్రయాణిస్తూ 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. సూర్యుడు మకర రాశితో కలసినప్పుడు, ఆ రేఖతో సంక్రమణం చెంది సూర్య గమనం ఉత్తర దిశగా మారి ఉత్తరాయణ పుణ్యకాలం మనకు వస్తుంది. అలాగే, కర్కాటక రేఖతో కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు, సూర్య గమనం దక్షిణ దిశగా ప్రారంభమై దక్షిణాయణం వస్తుంది. ఈ రెండు (ఒక్కొక్కటి 6 మాసాలు) చొప్పున ఆయనాలు పూర్తయితే ఒక్క సంవత్సర కాలం పూర్తవుతుంది.
అందుకే భీష్మ పితామహుడు దక్షిణాయనంలో అంపశయ్య మీద ఉన్నా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూసి ఆ తర్వాత తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ సమయాన్ని పితృదేవతల ఆరాధనా పుణ్య కాలంగా కూడా పరిగణిస్తారు. ఇలా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్య దినాన్ని మకర సంక్రమణ సంక్రాంతిగా ప్రాధాన్యత పొందింది.
సంక్రాంతికి ఇవి కూడా చేస్తే ఉత్తమం…
సంక్రాంతిలో పేరులో “సం” అనగా మిక్కిలి క్రాంతి. అంటే అభ్యుదయం అని అర్ధం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కనుక దీన్ని సంక్రాంతిగా పూర్వ పెద్దలు చెబుతారు. మకరం
అనగా మొసలి అని అర్థం. అది పట్టుకుంటే ఇక వదలదు. కాని మానవులకి అధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా అడ్డు తగులుతూ, మోక్ష మార్గానికి అనర్హులని చెయ్యటంలో మొసలి అందవేసిన చేయి. అందువల్ల ఈ మకర సంక్రమణ బారి నుంచి తప్పించుకోవడానికి ఇక ఒక్కటే మార్గం.. అందరూ తమ శక్తికి అనుగుణంగా “దాన ధర్మాలు” చేస్తే ఎంతో ఉత్తమం అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. కేవలం ఈ సంక్రాంతి మూడు రోజులు మాత్రమే కాకుండా మిగతా రోజుల్లో కూడా మకర సంక్రమణ ప్రభావం ఉండకుండా ఉండేందుకు నిత్యం దాన ధర్మాలు చేస్తే ఎంతో ఉత్తమం మరియు మానవత్వాన్ని చాటి చెప్పినట్టు, మంచితనాన్ని పంచుకునేట్టు, నిస్సహాయులకు జీవితంలో ముందుకెళ్ళే నూతన ఉత్సాహాన్ని నింపినట్టు అవుతుంది.

సంక్రాంతి పండుగ విశిష్టత…
తెలుగింటి సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా అందరు జరుపుకునే ఈ పండుగ వెనుక ఎంతో విశిష్టత మరియు మంచి పరమార్దాలున్నాయి దాగివున్నాయ్.
సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండుగ. ఎందుకంటే పంటలు చేతికి వచ్చి ఇంటికి చేరిన తరువాత, రైతులు సంతోషంతో సంక్రాంతిని పండుగను జరుపుకుంటారు. కొత్త ధాన్యంతో అన్నం కాకుండా ఆ బియ్యంతో పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. అవి జీర్ణ సమస్యలను నివారిస్తాయి. తమిళనాడులో సంక్రాంతిని ‘పొంగల్’ అని పిలుస్తారు. అక్కడ కొత్త బియ్యంతో పొంగల్ చేసి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు. సంక్రాంతి రోజున ప్రకృతిని, పశువులను కూడా పూజించడానికి సంబంధించింది.
సంక్రాంతి పండుగలో నువ్వుల ప్రత్యేకత చాలానే ఉంది. ఎందుకంటే నువ్వులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి. వాతావరణ ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చే సమయంలో నువ్వులు శరీరానికి వేడి ఇస్తాయి. అందుకు శరీరం అలవాటు పడుతుంది. మకర సంక్రాంతి భోగితో ప్రారంభమవుతుంది.. తెల్లారుజామున ప్రజలు తమ ఇంటి ముందు భోగిమంటలు వేస్తారు. ధనుర్మాసం మొదటి రోజు నుంచి వైష్ణవ దేవాలయాల్లో గోదాదేవి తిరుప్పావై పాశురాలతో దేవుడిని ఆరాధిస్తారు. తిరుప్పావైతో రంగనాథుణ్ణి ఆరాధించిన గోదా దేవి, భోగి రోజు స్వామిని వివాహమాడి ఆయనలో లీనమైంది. అందుకే ధనుర్మాస వ్రతాన్ని భోగితో ముగిస్తారు.
భోగి రోజు చిన్న పిల్లల శిరస్సుపై భోగి పళ్ళు వెయ్యడం ఒక సాంప్రదారం. రేగిపళ్లను బదరీ ఫలాలు అని కూడా పిలుస్తారు. సూర్యుని కాంతిని తనలో నిలుపుకునే శక్తి కల్గిన రేగి పండ్లను పిల్లలపై పోయడం వలన వారికి సూర్యునికి ఉన్నంత శక్తి సమకూరుతుందని పెద్దలు చెబుతారు. అందుకే తమ తమ ఇళ్ళల్లో చిన్న పిల్లలకు రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర మరియు నవధాన్యాలు కలిపి భోగి పళ్ళను పోస్తారు.

ఇక సంక్రాంతి అంటే ఇళ్ళ ముందు ముగ్గులు.. గొబ్బెమ్మలు.. అంబరాన్ని తాకే గాలిపటాల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లెటూర్లలో ఈ పండగ సమయంలో వీధుల్లో హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు తిరుగుతూ సందడి చేస్తారు. ఇక సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు పూజ చెయ్యడం అనాదిగా వస్తున్న ఆచారం. సంక్రాంతి సమయంలో చేసే దానధర్మాలు వల్ల పితృ దోషాలు తొలగిపోతాయి.
ఇక సంక్రాంతి ఆఖరి రోజున, సంవత్సరం మొత్తం తమ యజమానుల కోసం కష్టపడి పంట పండించడంలో సహాయపడిన పశువులను పూజించే “కనుమ”. కనుక రోజున ఆవులను, ఎద్దులను, బర్రెలను ముస్తాబు చేసి, రైతన్నలకు నేస్తాలైన పక్షుల కొరకు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులను కడతారు.
ఇలా సంక్రాంతి పండుగ అనేది మనిషిని ప్రకృతితో మమేకమౌతూ జరుపుకునే ఓ గొప్ప సంబరం.