మహా శివరాత్రి విశిష్టత ఏంటి?
మన ముఖ్యమైన పండుగల్లో ఒకటి మహా శివరాత్రి. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినం. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
Table of Contents

మహా శివరాత్రి విశిష్టత ఏంటి?
శివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాల ద్వారా సోకిన కర్మ కొంతైనా నశిస్తాదని భక్తుల నమ్మకం. తెల్లవారు జామున నిద్ర లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఇక ప్రతీ దేవాలయమూ కిక్కిరిసిపోతుంది. ఇక శివాలయాల సంగతి చెప్పాల్సినవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనంత భక్తుల రద్దీ కనిపిస్తుంది. పాలాభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. మహాశివరాత్రి రోజున శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో భక్తిభావనలతో నిండిపోయుంటాయి. మహాశివరాత్రి అంటే శివయ్యకు, తన భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు.
మహా శివరాత్రికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే మన హిందూ పురాణాల ప్రకారం.. మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా, అదే రోజు లింగోద్భవం జరిగిందని చెప్తారు. పరమశివుడు పురుషుడిని సూచించగా, పార్వతీ మాత ప్రకృతిని సూచిస్తుంది . సృష్టికి మూలకారణమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. అందుకని మహా శివరాత్రి చాలా ప్రత్యేకమైంది.
అనుకోకుండా చేసినా కలిగే ఫలితం
ఎవరైతే భక్తితో మహా శివరాత్రి రోజున శివుడిని పూజిస్తారో.. ఉపవాసం, జాగరణ దీక్షలను ఆచరిస్తారో.. వారికి శుభాలు మరియు శివుడి కటాక్షం వారిపై ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినాన ఎవరైతే మనసులో శివున్ని లగ్నం చేసుకుని అతన్ని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తారో, వారికి శివుని కటాక్షం లభిస్తుందని చెప్తారు. భక్తులు పరమేశ్వరున్ని ఆరాధించడమే కాదు, ఏ వ్యసనం ఉన్నా వాటిని వీడేందుకు ఆరోజునే ప్రయత్నం మొదలుపెడితే ఫలితం పొందుతారని నమ్మకం. ఏడాది పొడుగునా వివిధ కారణాల చేత పూజలు చెయ్యనివారు కూడా మహా శివరాత్రి రోజున ఈశ్వరున్ని ప్రార్ధిస్తే శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో చాలా కధలున్నాయి. ఆఖరికి పాపాలు చేసేవారు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుదంటారు. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం.
గుణనిధి కథ
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ‘గుణనిధికి’ ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవాటు చేసుకుంటాడు. అన్ని రకాలుగా పతనమైపోయిన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ఇక ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్ళాక చీకటిలో అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి అక్కడే ఉండి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు వదిలి ఆ విధంగా ముక్తి పొందుతాడు. శివరాత్రి మహత్యం అంత గొప్పది.

జాగరణ ఎందుకు?
జాగరణతో కూడా పాపాలు తొలగి పుణ్య గతులు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. మహా శివరాత్రి రోజు ఎందుకని తప్పనిసరిగా జాగరణ చేస్తారు? అనగా నిద్రపోకుండా ఎందుకు ఉంటారు అనే ప్రశ్నలకు పండితులు ఇలా సమాధానం చెప్పారు. మహా శివరాత్రి పర్వదినాన ఈశ్వరున్ని భక్తి శ్రద్ధలతో పూజించి, శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందుతారు. మహా శివరాత్రి రోజున రాత్రి ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరణతో ప్రతి ఒక్కరు అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు మరియు బిల్వార్చనలు కొనసాగుతాయి. “హర హర మహాదేవ శంభో శంకర” అంటూ శివుని నామస్మరణతో మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా , శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉండే పర్వదినంగా జరుపుకోండి!
మోక్షం దక్కుతుంది..
గరుడ, పద్మ, స్కంద, అగ్ని పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో.. వారంతా ఈశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. అంతేకాదు మంత్రాలు తెలియనివారు సైతం కేవలం భక్తి శ్రద్ధలతో శివలింగంపై చెంబు నీళ్లు పోసినా తన ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. ఇక రాత్రి వేల జాగరణ ఉండటం వలన శివయ్య నరకం నుంచి రక్షిణ మరియు మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు.