Blog
Aghora Chapter 4 – Part 2 Telugu | విధి మరియు ఋణానుబంధనం
🕉️ Aghora – At The Left Hand Of God
✍️ Written by Robert E. Svoboda
📖 తెలుగు అనువాదం by Rushivarya – The Vaidic Icon®
Aghora Chapter 4 – Rnanubandhana | Part 2: Fate and Rnanubandhana
అఘోరా అధ్యయనం 4 – ఋణానుబంధనం | భాగం 2: విధి మరియు ఋణానుబంధనం
⚠️ గమనిక:
పుస్తకంలో మాట్లాడుతున్నది విమలానంద అఘోరి
విధి మరియు ఋణానుబంధనం
ఈ అధ్యాయంలో అఘోరి సంప్రదాయం “విధి”, “మరణం”, “ఋణానుబంధం” అనే భావనలను చాలా లోతుగా వివరిస్తుంది. మనిషి తన జీవితాన్ని తానే నడిపిస్తున్నానని భావించినా, అసలు జీవిత ప్రవాహం వెనుక కాలం, కర్మ, ఋణబంధాలు పనిచేస్తూనే ఉంటాయని ఇందులో చెప్పబడింది.
కొంతమంది “ఆత్మహత్య చేసుకుంటే విధిని మోసం చేయొచ్చు” అనుకుంటారని రచయిత చెబుతాడు. కానీ అఘోరి దృష్టిలో అది కూడా ముందే నిర్ణయించబడిందే. ఎవరికైనా ఆత్మహత్య ఆలోచన రావడం కూడా మహాకాలుడి ప్రభావమే అని ఆయన భావన. మరణం అనేది యాదృచ్ఛికం కాదు; అది జన్మ సమయంలోనే నిర్ణయించబడిన ఒక గమ్యం.
ఇది వివరించడానికి ఒక పురాణసదృశ కథ చెబుతాడు. ఒక రాజ జ్యోతిష్కుడు ఎన్నో సంవత్సరాలు శివుని ప్రార్థించి ఒక కుమారుడిని పొందుతాడు. కానీ జాతకం చూసి భయపడిపోతాడు. ఆ బాలుడు తన తొమ్మిదో ఏట తల్లిదండ్రులకు లక్ష రూపాయలు ఇచ్చి మరణిస్తాడని జాతకంలో తెలుస్తుంది. ఒక చిన్న బాలుడు లక్ష రూపాయలు ఎలా సంపాదిస్తాడు అని ఆశ్చర్యపోయినా, తండ్రి భయంతో అతన్ని ఇంట్లోనే పెంచుతాడు. ఎక్కడికీ పంపడు.
ఆ బాలుడు ఎనిమిదేళ్లు దాటిన తర్వాత తండ్రి తన భార్యను పదేపదే హెచ్చరిస్తుంటాడు — “ఈ బాలుడి చేతి నుండి ఏదీ తీసుకోకు” అని. ఆమె కూడా సరే అంటుంది. కానీ మహాకాలుడు తన పని మొదలుపెడతాడు.
అదే సమయంలో రాజు భార్య గర్భవతి అవుతుంది. ఒకరోజు ఆ బాలుడు తోటమాలి భార్యతో కలిసి రాణి గది దగ్గరకు వెళ్తాడు. అక్కడ కొత్తగా పుట్టబోయే శిశువు భవిష్యత్తు గురించి పాన్ రసంతో గోడపై రాస్తాడు — “ఈ బాలుడు తన తండ్రికంటే గొప్పవాడు అవుతాడు. 125 సంవత్సరాలు జీవిస్తాడు” అని.
తర్వాత రాజ జ్యోతిష్కులు జాతకం చూసి భయపడిపోతారు. “ఈ శిశువు ముఖాన్ని తండ్రి చూస్తే తండ్రి మరణిస్తాడు” అని చెబుతారు. రాజు భయంతో తన పుట్టిన బిడ్డను చంపమని ఆజ్ఞాపిస్తాడు. కానీ అడవికి తీసుకెళ్లిన ఇద్దరు కసాయిలకు కరుణ కలుగుతుంది. వారు శిశువును చంపకుండా వదిలేస్తారు. మహాకాలుడు పరిస్థితులను ఎలా మలుస్తాడో ఈ కథ ద్వారా చూపిస్తాడు రచయిత.
తర్వాత రాజుకు పశ్చాత్తాపం కలుగుతుంది. గోడపై రాసిన మాటల గురించి తెలుసుకుని, ఆ బాలుణ్ని పిలిపిస్తాడు. బాలుడు ధైర్యంగా “ఆ శిశువు చనిపోలేదు” అంటాడు. చివరకు శిశువు సజీవంగా కనబడతాడు. రాజు ఆనందంతో ఆ బాలుడికి లక్ష రూపాయల బహుమతి రాసి ఇస్తాడు.
ఆ బాలుడు ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లి “అమ్మా!” అంటూ ఆ చీటీని తల్లి చేతిలో పెడతాడు. ఆమె అది తీసుకున్న క్షణానికే బాలుడు మరణిస్తాడు. జాతకంలో చెప్పినట్లే — తల్లిదండ్రులకు లక్ష రూపాయలు ఇచ్చి అతను మరణించాడు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా విధి తప్పదని ఈ కథ ద్వారా చెప్పబడింది.
అఘోర పుస్తకం : Aghora Chapter 4 – Part 3 Telugu | రాను
రచయిత మరికొన్ని ఉదాహరణలు కూడా చెబుతాడు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి కూడా బ్రతికిపోయిన కథను చెబుతాడు. విషం తాగి, గ్యాస్ ఆన్ చేసి, సిగరెట్ వెలిగించగానే ఇల్లు పేలిపోతుంది. కానీ అతను మాత్రం బ్రతికిపోతాడు. ఎందుకంటే అప్పటికీ అతని మరణ సమయం రాలేదు అని రచయిత భావన.
ఇంకో వ్యక్తి పది సంవత్సరాల పాటు చనిపోవాలని కోరుకున్నా చనిపోలేడు. చివరకు ఒకరోజు శివాలయంలో శివలింగాన్ని కౌగిలించుకుని మరణిస్తాడు. రచయిత దృష్టిలో అతను చివరకు మహాకాలుణ్ని పొందాడు.
ఈ అధ్యాయం మొత్తం ఒక ముఖ్యమైన భావన చుట్టూ తిరుగుతుంది — మనిషి జీవితం పూర్తిగా తన నియంత్రణలో లేదని. మనం నిర్ణయాలు తీసుకుంటున్నామనిపించినా, లోతులో విధి, కాలం, కర్మ, ఋణానుబంధాలు పనిచేస్తూనే ఉంటాయని అఘోరి తత్వం చెబుతుంది.
అయితే చివర్లో రచయిత ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాడు. మనకు గత జన్మల జ్ఞానం లేకపోవడం ఒక ఆశీర్వాదమని. ఎందుకంటే ఎవరు మనకు మంచివారు, ఎవరు చెడ్డవారు అని ముందే తెలిసిపోతే మనం ప్రేమతో జీవించలేం. ప్రతి సంబంధాన్ని అనుమానంతో చూస్తాం. అందుకే ప్రకృతి మనకు మరచిపోయే వరం ఇచ్చిందని ఆయన భావన.
మీకు ఒక ప్రశ్న రావచ్చు.... ఆత్మహత్య ముందే నిర్ణయించబడడం ఏంటి అని.
ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా, బాధ్యతగా అర్ధంచేసుకోవాలి. ఎందుకంటే అఘోరి తత్వం ఒక ఆధ్యాత్మిక–తత్వశాస్త్రీయ దృష్టికోణం, అంతేగాని అది ఆత్మహత్యను సమర్థించడం కాదు. ధర్మంలో అంతరార్ధం అనేది చూడడం ఎంతో ముఖ్యం.
“అఘోరి తత్వంలో కొన్ని భావనలు ప్రకారం, మనిషి జీవితంలో జరిగే సంఘటనలు — మరణం సహా — కాలం, కర్మ, ఋణానుబంధాల ప్రవాహంలో భాగమని భావిస్తారు. ఆ దృష్టిలో ఆత్మహత్య ఆలోచన కూడా ఒక అంతర్గత కర్మబంధం లేదా మానసిక స్థితి ఫలితంగా చూడబడుతుంది. అయితే ఇది ఆత్మహత్యను ప్రోత్సహించడం కాదు, సమర్థించడం కాదు. జీవితం విలువైనది, మరియు బాధలో ఉన్నప్పుడు సహాయం కోరడం అత్యంత అవసరం అని గుర్తుచేస్తుంది.”
ఎందుకంటే చాలా మంది “అంటే చనిపోవడం ముందే రాసి ఉంటే ప్రయత్నం ఎందుకు?” అనే తప్పు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
అఘోరి సంప్రదాయంలో కూడా ప్రధాన ఉద్దేశ్యం:
మరణాన్ని మహిమాపరచడం కాదు,
మరణ భయాన్ని అధిగమించడం.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం —
ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పే “విధి” అనే భావన మనిషిని నిస్సహాయుడిని చేయడానికి కాదు; జీవితం మీద లోతైన అవగాహన తెచ్చేందుకు.
కనుక….
- ఆత్మహత్య ఒక తీవ్రమైన మానసిక బాధ సంకేతం అని,
- సహాయం తీసుకోవడం బలహీనత కాదు అని,
- ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని వదిలేయడం కాదు, జీవితాన్ని మోయడానికి అంతర్గత బలం పొందడం అని అర్ధంచేసుకోవాలి.
హత్య, ఆత్మహత్మ, సహజంగా జరిగే విషయాలు అంటే యాక్సిడెంట్లు వంటివి. మూడు కూడా మరణానికి దారితీస్తాయి. ఏది ఎలా జరిగినా జరిగేది మాత్రం మరణం. పైన రచయిత చెప్పినట్టు సమయం సాశిస్తుంది. ప్రాణం ఇవ్వాలన్నా, తీయాలన్నా..
నా వ్యక్తిగత జీవితం నుంచి ఉదాహరణగా ఒక సంఘటన
2014 డిసెంబర్ 28 మధ్యాహ్నం 1:45 – 12న నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. వెనుక నుంచి వచ్చిన మెట్రో బస్సు, ముందున్న కారు మధ్యలో నా వాహనం నలిగిపోయింది. కార్ అద్దాలు పగిలి నా ముఖాన గుచ్చుకున్నాయ్, నా ఎడమ కాలు గాయపడింది. అంతటి తీవ్ర పరిస్థితిలో కూడా దైవ నామ స్మరణ చేసుకున్న కొత్తపాటి స్పృహతో. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేసారు..
తరవాత తెలిసిన విషయం ఏంటంటే నాకు యాక్సిడెంట్ జరిగిన పక్క ప్రాంతంలోనే మరొక యాక్సిడెంట్ జరిగి అతడు ప్రాణం కోల్పోయాడని.
వారం రోజుల తర్వాత కాస్త మాములు మనిషిని అయ్యాక అప్పుడు అనిపించింది.. బహుశా నాకు సమయం ఇంకా ఉందని..
ఆ యాక్సిడెంట్ తర్వాతనే నాకు ఆధ్యాత్మిక మేల్కొలుపు జరిగి ఈరోజు “ఋషివర్య” అనే నామకరణంతో ఇలా వ్రాయగలుగుతున్న..
ఇలా ఉంటుంది కాల ప్రవాహం. ఒకే సంఘటన ఇద్దరికి జరిగితే గమ్యాలు మాత్రం భిన్నంగా ఉంటాయి.