పురాణాలు శాస్త్రాలు

కలియుగ లక్షణాలు – శివపురాణం

కలియుగ లక్షణాలు – శివపురాణం
Views: 0

కలియుగ లక్షణాలు – శివపురాణం

ఇది యుగం కలియుగం. కలిపురుషుడి ఉత్పత్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది! “క్రుద్దుడు” అనబడే వాడు “హింస” అనబడే తన తోడబుట్టిన చెల్లెల్నే వివాహమాడాడు. వారికి కలిగిన కుమారుడే “కలిపురుషుడు”. అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది.
“ధర్మమా”! అంటే ఏమిటి? అనేవాడే కలిపురుషుడు. అటువంటి వాడు కలియుగ పాలకుడు అయితే ఇంకెంత అధర్మంగా పలిస్తాడో ఆలోచించండి.

కలియుగ లక్షణాలు - శివపురాణం

అందుకే కలిపురుశుడిది పాపభూష్టమయిన జీవన విదానం. వేద విరుద్దమయిన జీవితం.
అసలు ఏది ఈశ్వరుడు నిషిద్ద కర్మగా చెప్పాడో.. దానియందు అనురక్తి పొంది, మనుష్యుల బుద్దినీ అటుగా మార్చడం కలిపురుషుడి పని. జీవితాలను ఎంత పతనాస్థితికైనా తీసుకుపోగలడు!

లక్షణాలు:

కలియుగం వచ్చిన వెంటనే జరిగేది ఏమిటంటే ప్రజల్లో పవిత్రత నశిస్తున్నది. పుణ్యము అంటే పవిత్రకర్మ అని. పవిత్రకర్మలు లేనివారై ప్రతివారూ దురాచారములయందు రతులై ఉంటారు. ఏవి సత్యములో ఆ మాటలపట్ల విముఖత్వం కలిగి ఉంటారు. సత్యము అంటే జరిగినది జరిగినట్లు చెప్పడమే కాదు త్రికాలములలోనూ నిలిచి ఉండు శాస్త్రవిషయము అని అర్థం. శాస్త్ర విషయములయందు విముఖులై ఉంటారు. వారి కాలక్షేపాలు ఎలా ఉంటాయంటే

ఇక్కడ మొత్తం నాలుగు ’పర’లు చెప్పారండీ. పరులపై నిందలు చేస్తూ, ఆ నిందలే కాలక్షేపాలుగా వెళ్తూ ఉంటారు. పరద్రవ్యములమీద, పరస్త్రీలమీద అభిలాష కలిగి ఉంటారు. పరహింసా పరాయణులై ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే కలియుగంలో ఉండే ప్రధాన దోషం

సర్వపాపములకూ మూలము దేహాత్మ దృష్టి. అంటే దేహమే నేను అనే ఆలోచన. దానిని తృప్తిపరచడానికి సర్వపాపములూ చేస్తున్నారు. దేహానికి అతీతమైనది ఒకటి ఉంది అని చెప్తే వీరికి ఎక్కదు. దానితో మూఢత్వం ఏర్పడి నాస్తికులై చరిస్తారు. నాస్తికులు అంటే
“నాస్తికో వేదనిందకః” అంటారు గౌతములు. వేదనిందకులై శాస్త్రములయందు విశ్వాసము లేనివారై పశుబుద్ధులతో తల్లిదండ్రులపై ద్వేషబుద్ధి కలిగి ఉంటారు. కలియుగంలో స్త్రీలే దేవతలు. కామమునకు కింకరులైపోతారు.

విప్రులు లోభమనే గ్రహానికి లోనైపోతారు. లోభమనే గ్రహం వారిని పట్టి పీడిస్తూ ఉంటుంది. దానితో వారు వేదములను విక్రయిస్తూ ఉంటారు. వేదాది విద్యలనూ ధనార్జనకోసమే నేర్చుకుంటారు. విద్యల ప్రయోజనము ధనము అనే దృష్టి ఏర్పడే యుగం కలియుగం. చిట్టచివరికి పరమార్థాలకు పనికివచ్చే విద్యలను కూడా ధనార్జన దృష్టితో నేర్చుకుంటారు. అంతేకాక ఆ విద్యవల్ల మదం, మదంతో తమను తామే మరచి ప్రవర్తిస్తారు.

విప్రులు తాము చేయవలసిన కర్మలు విడిచిపెట్టి పరులను వంచిస్తూ తిరుగుతూంటారు. త్రికాలసంధ్యావందనాలు విడిచిపెట్టి బ్రహ్మజ్ఞానము లేకుండా ఉంటారు.

దయలేనివారే పండితులవలె చలామణి అవుతూ.. నిజమయిన పండితులకి, వారి ఆచారాలకీ, వ్రతాలకీ లోపం కలిగిస్తూ ఉంటారు.

క్షత్రియులు స్వధర్మాన్ని విడిచిపెట్టి అసత్పురుషులతో సాంగత్యం చేస్తూ పాపరతులై ఉంటారు.
శూరత్వం ఉండదు. యుద్ధం అనగానే వెనకడుగు వేస్తారు. శత్రువులు ఎంతమంది విజృంభిస్తున్నా చేతకాని మెతకతనం పాలకులలో సంక్రమిస్తుంది. క్షత్రియులు అంటే ఇక్కడ జాతిమాత్రమే అని కాకుండా పాలకులు అని తీసుకోవచ్చు. దొంగలే పాలకులవుతుంటారు. పాలకులు దొంగలవలె ప్రవర్తిస్తూ ఉంటారు. కామకింరులై ఉంటారు.

రాబోవు కలియుగ లక్షణాలను మహర్షులు పురాణాలలోనే చెప్పారు ఇలా..

శస్త్రాస్త్ర విద్యలు ఉండవు. గోవులను హింసిస్తారు. విప్రుల సంపదలపై ఆశలు పడతారు. దేవద్రవ్యాలను భోగిస్తారు.

ప్రజాసంహారకా దుష్ట జీవహింసకరాముదా!! హింసాపరాయణులౌతారు.ఇక వైశ్యులు కూడా వారి ధర్మాలు వారు విడిచిపెట్టి

చెడుమార్గాలలో సంపాదించాలని వ్యాపారాలు చేస్తారు. ఇక్కడ వైశ్యులు అనగా వాణిజ్యవేత్తలు. జన్మతః ప్రాప్తించిన వర్ణములు మాత్రమే కాకుండా, వృత్తిగా చేసేవారు కూడా అన్వయించుకోవాలి. దానికే వ్యాపార ధర్మాలు అని పేరు పెడతారు. మోసంతో వ్యాపారం చేయడం వ్యాపార ధర్మం కాదు. పైగా “తులాకర్మకువృత్తయః” – తూకాలలో మోసాలు చేస్తూ ఉంటారు.

గురువుల, వేదవేత్తల, దేవుని పట్ల భక్తిలేనివారై ఉంటారు.శూద్రాదులు స్వధర్మాన్ని విడిచిపెట్టడమే కాకుండా.. ”కుటిలాః ద్విజదూషకాః” – బ్రాహ్మణులను దూషిస్తూ తిరుగుతారు. ధనవంతులైన వారైతే కుకర్మలు చేస్తారు. విద్యావంతులైతే వితండవాదం చేస్తూంటారు.

• “స్త్రియశ్చ ప్రాయశో భ్రష్టా భర్త్రవజ్ఞాన కారికాః!” – స్త్రీలు ఎక్కువమంది భ్రష్టాచారులై భర్తను అవమానించడంలోనే ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
• “శ్వశురద్రోహ కారిణ్యః” – మామగారింటికి ఎసరు పెట్టే లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు.
•  “నిర్భయా మలినాశనాః” – అధర్మం చేయడంలో తెగింపు ఉంటుంది వారికి. ఒకప్పుడు శుద్ధమైన అన్నం పుట్టింది అంటే స్త్రీవల్లనే. ఆ స్త్రీయే ధర్మ భ్రష్టురాలు అవడంతో మలినాన్ని తింటారు ఇళ్ళల్లో. ఆచార రహితంగా వండే అన్నం మలినం.
• “కు హావ భావ నిరతాః కుశీలాః స్వరవిహ్వలాః”: – చెడ్డ హావభావములతో, చెడ్డ శీలములతో ప్రవర్తిస్తూ ఉంటారు.

Leave a Reply