మాస్టర్ సి.వి.వి

మాస్టర్ సి.వి.వి

దక్షిణ భారతదేశములో, దేవాలయముల నగరముగా ప్రసిద్ధి గాంచిన క్షేత్ర రాజము, కుంభకోణము అనబడే పట్టణమున “కంచుపాటి వెంకటరావు వెంకాస్వామిరావు” అనే నామధేయముతో మాస్టర్ సి. వి. వి. గారు 1868 వ సంవత్సరము ఆగష్టు 4 వ తేదీన అవతారమూర్తిగా ఉదయించారు.కుంభకోణము పేరులో కుంభ రాశికి కోణ దృష్టిలో ఉన్న వాయు రాశి అయిన మిథున రాశిలో ఈ యోగము ఉపదేశింపబడడం ఒక రహస్య సంకేతము.

మాస్టరు గారికి 12 సంవత్సరముల వయస్సులో సౌ. రుక్మిణి అనే బాలికతో వివాహము జరిగింది. ఆమె ద్వారా ముగ్గురు కుమార్తెలు మరియు ముగ్గురు కుమారులు కలిగారు. ఆయనకు 36 సంవత్సరముల వయస్సులో భార్య వియోగము సంభవించినది. తరువాత వారికి 38 సంవత్సరముల వయస్సులో సౌ. వెంకమ్మ గారితో ద్వితీయ వివాహం జరిగినది. తద్వారా ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె కలిగారు.

మాస్టరు గారు సంస్కృతము, తెలుగు, తమిళము, మరియు ఆంగ్ల భాషలలో అనర్గళంగా సంభాషించేవారు. వేదవిద్యలలోను మరియు సంగీతములోను వారు అత్యంత ప్రావీణ్యులు. నగరంలో మేయరుగా అత్యంత ప్రధాన పాత్ర పోషించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అత్యంత ప్రముఖులుగా గుర్తింపు పొందారు.

వారు బాహ్యమునకు వ్యాపారవేత్తగా, అతి సామాన్యముగా, సాధారణ జీవనము సాగించినట్లుగా కనిపించినప్పటికీ, ప్రధానముగా వారు భూమికి, భూమి జీవులకు ఉద్ధరణము కల్గించే మహత్తర కార్యక్రమము వర్తింపచేయుటకు దిగివచ్చిన అవతారమూర్తి.

భూమి జీవుల ఉద్ధరణమునకు వేగాన్నిజోడించే ప్రయోజనము కొఱకై పరబ్రహ్మమే తనకు తానుగా సంకల్పించుకొని శారమేయ మండలము ద్వారా 1910 వ సంవత్సరములో “హేలీ” తోక చుక్కను ఆధారము చేసుకొని కుంభ చైతన్యముగా భూమికి చేరుట జరిగినది. ఆ కుంభ చైతన్య ప్రజ్ఞను అందుకున్నవారు “మాస్టర్ సి. వి. వి.”. వీరు నీలగిరులలో నివసించు అగస్త్య అంశగా, అనంత ప్రాణప్రసారము కొరకు అవతరించిన తేజోమూర్తి, అవతారమూర్తి. దివ్యజ్ఞాన సమాజం వారు అగస్త్యులవారిని బృహస్పతిగా గుర్తింతురు.

వీరు అందించిన “భృక్తరహిత తారక రాజ యోగము” జీవుల గ్రహస్థితులను చక్కపరిచి, త్వరితగతిన పురోగతి, శ్రేయస్సు కల్గించుచున్నది. కుంభ యుగమున జీవులు బ్రహ్మానుభూతి పొందుటకు శబ్ద తరంగములే ఆధారము అని తెలియజేసి, “సి. వి. వి.” అనే బీజాక్షరాల ద్వారా కుంభ చైతన్య ప్రజ్ఞను మనకు అందించారు.

మాస్టర్ సి. వి. వి. గారు 1922 సంవత్సరము మే నెల 12 వ తేదీన ముందుగా తెలియజేసిన సమయములో తమ దేహత్యాగము చేసిరి.

జగద్గురు పీఠము, మాస్టర్ సి. వి. వి. గారి పర్యవేక్షణలో, అంతరంగ ప్రణాళికగా, యోగసాధన నిర్వహించుచున్నది. ఈ నూతన యోగ ప్రవక్తగా మాస్టరు గారి నిర్దేశములు:

  • బృందములను విజ్ఞానము మరియు ఆత్మ చైతన్యపు ప్రసార వాహికలుగా తీర్చి దిద్దుట.

  • “మాస్టర్ సి. వి. వి. నమస్కారం” అను మంత్రోచ్చారణ, దాని శబ్ద తరంగముల ద్వారా జీవుల పంచభూతాత్మకమైన దేహము, మరియు అంతరంగ మానసిక, సూక్ష్మ శరీరములను శుభ్ర పరచుట.

  • జీవుల యందు అస్వస్థతలను నిర్మూలించి, పరిపూర్ణ సూక్ష్మ శరీర నిర్మాణము గావించుట.

  • జీవుల యందలి వ్యక్తిగత “కుండలిని” మేల్కొలిపి, ఇతర జీవుల కుండలినితోను, విశ్వ కుండలినితోను సమన్వయము గావించుట.


మాస్టరు గారు నిర్దేశించిన ధ్యానము:

  • అంతర్యామిగా ఉన్న బ్రహ్మమును గుర్తించవలెను. ధ్యానములో పరిమితులను దాటి, మొదటగా తన గురు రూపము కాంతులను ఆధారము చేసికొనియున్ననూ, క్రమముగా శబ్దము, రంగు, రూపము, ఆలోచనలను దాటి కేవలము బ్రహ్మము యందు ధ్యానము స్థిరపడవలెను.

  • ధ్యానము, ప్రార్థనలకు ఒక నియమిత సమయము కేటాయించుకొనవలెను. ఉదయ, సాయం సంధ్యలు, అనగా ఉదయం మరియు సాయంత్రము 6 గంటల సమయమును నియమించుకొనవచ్చును.

  • 3 సార్లు కాని, 7 సార్లు గాని ఓం కారమును మృదువుగా, దీర్ఘముగా, సామాన్య వేగముతో ఉచ్చరించవలెను. ఓంకారము తప్పనిసరిగా తాను వినవలెను.

  • మాస్టరు గారిని మనసులో దర్శిస్తూ – “నమస్కారమ్స్ మాస్టర్ సి. వి. వి.” అను మంత్రము ఉచ్చరించి, ధ్యానించవలెను.

  • తరువాత 15 నిమిషములు మౌనము పాటిస్తూ, లో తట్టున ఏమి జరుగుతున్నదో గమనించవలెను (Dip Deep). అంతరంగమున ఆలోచనల పుట్టుక స్థానమును గమనించవలెను.


ఈ విధముగా శరీరములో సర్దుబాట్లు జరిగి, అవరోధములు తొలగును. ప్రాణశక్తి ధారాళముగా, అడ్డములు లేకుండా సాగును. ప్రాణశక్తి ప్రసరణ వలన శరీరములో జరుగవలసిన సర్దుబాట్లు, మరమ్మత్తులు జరిగి సూక్ష్మ శరీర నిర్మాణమునకు ఉపకరించును. శరీరమంతటా శక్తి ప్రసారము జరుగుటకు కనీసము 15 నిమిషముల సమయము కేటాయించవలెను.