పండుగలు, తెలుగు

వసంత పంచమి విశిష్ఠత

వసంత పంచమి విశిష్ఠత
Views: 1

నేపథ్యం

హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది మాఘ మాసంలో వచ్చే శుద్ధ పంచమినే ” వసంత పంచమి” అని “శ్రీ పంచమి ” అని ” మదనపంచమి ” అను పేర్లతో ఈ పండగని జరుపుకుంటారు. ఈ పండుగ శీతాకాలంనకు ముగింపుగా, వసంతకాలమునకి ఆగమనంగా మొదలవుతుంది. ఈ పండుగ రోజునే హిందూ దేవత అయిన “సరస్వతీ దేవి” జన్మించింది కనుక ఈ దేవతని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈమె సర్వవిద్యలకు మూలాధారం. సంగీతం , నృత్య కళలకు ఈ దేవి మూలం కనుక యావత్ భారతదేశంలో విశేషంగా ఆరాధిస్తారు. ఈ తల్లిని జ్ఞానసిద్ధి కోసం పూజించవలెనని మనకు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది. మాఘమాసం లో వసంతుని స్వాగతిస్తూ “వసంత పంచమిని “, ప్రేమను కలిగించేవారు కనుక “రతీ-మన్మధులను ” పూజించడం ద్వారా కూడా ఈ పండుగని “మదనపంచమి” గా జరుపుకుంటారు. ఈరోజు ఈ దేవి ఆరాధన ద్వారా జనుల మధ్య ప్రేమాభిమానాలు మరియు జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి. ఈ వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజించే ఆరాధనను శ్రీమహావిష్ణువు నారదునికి వివరించినట్లు దేవీ భాగవతం మనకు తెలియజేస్తుంది.

వసంత పంచమి విశిష్ఠత

దేవి వర్ణన

సరస్వతి దేవి అహింసకు, జ్ఞానానికి ప్రతీక. ” సరః”అనగా కాంతి కనుకే సరస్వతి అయింది. అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతిని వెదజల్లే దేవత కనుక సరస్వతి అయింది. ఆమె శ్వేత వర్ణ దుస్తులను ధరించి శ్వేత కమలంపై ఆసీనురాలై వీణ, జపమాల , పుస్తకం మరియు అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింస మూర్తి గనుక ఎలాంటి ఆయుధాలు ఉండవు. మేధస్సుకి, అహానికి, చురుకుదనానికి, మరియు మనసుకి ప్రతీకగా చెబుతారు. ఆమె ధరించిన తెల్లని వస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం. ఆమె వాహనం “హంస “. ఈ వాహనం ప్రజలు తమయొక్క మంచి-చెడుల సామర్థ్యాన్ని గుర్తించేలా ఉండాలని తెలియజేస్తుంది. అలాగే సరస్వతి మాత జ్ఞానానికి అధిదేవత కనుక ఆమెకు సత్యానుభవం కూడా తెలుసు., నెమలి వాహన దారియై ఉన్నప్పుడు జ్ఞానం ద్వారా అహంకారాన్ని కూడా అరికట్టవచ్చని తెలియజేస్తుంది.
అర్చన విధానం *

  • శ్రీ పంచమి రోజున సూర్యోదయం కంటే ముందుగా నిద్రలేవాలి. తలస్నానం చేసి ప్రకాశవంతమైన పసుపు (లేదా) తెల్లని వస్త్రాలను ధరించాలి. ఈ పసుపు , తెలుపు రంగులు ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటాయి. ఇది ప్రకృతి ప్రకాశానికి , జీవిత చైతన్యాన్ని మరియు తెలుపు ప్రశాంతతని , జ్ఞానాన్ని సూచిస్తుంది.
  • శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత అమ్మవారి ఫొటో (లేదా) విగ్రహాన్ని ప్రతిష్టించి, పసుపు లేదా తెల్లని వస్త్రములను ఆ తల్లికి సమర్పించాలి. అమ్మవారికి పసుపు లేదా తెల్లని వర్ణంలో ఉండే పుష్పాలను, అక్షింతలను, చందనం, శ్రీగంధం, ధూపం, దీపం సమర్పించుకోవాలి.
  • అమ్మవారికి ప్రత్యేకంగా కేసరిని , క్షీరాన్నాన్ని, నేతితో చేసిన వంటకాలను, నారికేళం, కదరీఫలములను నివేదన చేయాలి.
  • పూజా సమయంలో ఆ తల్లికి నమస్కారిస్తూ అమ్మవారి మంత్రాలను పఠించాలి.
  • ఈ పర్వదినాన అమ్మవారిని ఇలా ఆవాహన చేసి షోడశపచారాలతో పూజించి సర్వకాల, సర్వావస్థలయందు అనుగ్రహించాలని ఆ తల్లిని వేడుకుంటారు. మాతని కరుణతో పూజించినా అపారమైన జ్ఞానసరాశిని పొందగలం.
  • వాగేశ్వరి , మహా సరస్వతి, నీల సరస్వతి , సిద్ధ సరస్వతి , పరా సరస్వతి, ధారణ సరస్వతి , బాలా సరస్వతి” ఇలా అనేకమైన నామాలు ఉన్నప్పటికీ ” సామాంపాతు సరస్వతి భగవతి …” అని అర్చించే వారు ఆ తల్లి ప్రేమకు పాత్రులు అవుతారట. ఇంకా సరస్వతి దేవి ఆరాధన ద్వారా మీ సంసారిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఈ తల్లిని ఆరాధించిన వ్యాస, వాల్మీకి మహర్షులు ఆ తల్లి అనుగ్రహంతో పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లి కృపను పొందిన వారే..

Leave a Reply