ఉగాది పచ్చడి ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు

ఉగాది పండుగ అంటేనే ఆ రోజు తయారు చేసే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు నోటిలో నీళ్లూరిపోతాయి. ఉగాది పచ్చడిని చాలా మంది అంత ఇష్టంగా ఆస్వాదిస్తారు మరి. కొన్ని సంస్థలు, కార్యాలయాల్లో అయితే ప్రత్యేకంగా తయారు చేసి మరి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఉగాది పచ్చడిలో పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు,చేదు అనే ఆరు రుచులు కలుస్తాయి. ఇది నోటికి రుచిగా ఉండడం మాత్రమే కాదు, తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా. ఆరు రుచుల కలయికతో చేసే ఈ పచ్చడి తింటే వివధ అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే ఈ ఉగాది పచ్చడిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. ఇంకా ఉగాది పచ్చడి ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయో చూద్దాం..
ఉగాది పచ్చడిని పులుపు, ఉప్పు, తీపి, కారం, చేదు రుచులతో కలిపి చేస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడి వాత, పిత్త, కఫ మూడు దోషాలను సమతుల్యం (Balance) చేస్తుంది. అందువల్ల శరీరంలో ఏదైనా దోషం ఉంటే కనుక అది తగ్గిపోతుంది. అలానే శరీరం డీటాక్స్ కూడా అవుతుంది. రాబోయే కాలం కోసం మన శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఉగాది పచ్చడిని తినటం వలన ఋతువుల కోసం మనల్ని శారీరకంగా, మానసికంగా రెడీ చేస్తుంది. ఇందులో చేదు, తీపి రుచులు ఉంటాయి.
Also Read: ఉగాది పచ్చడి తయారీ విధానం
శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభంలో ఉగాది పండుగ వస్తుంది. ఈలోపు అనేక జలుబు, జ్వరాలు ఇలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటి నుండి కాపాడుకునేందుకు ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు పదార్థాలు ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఉగాది పచ్చడిలో బెల్లం, వేప పువ్వు వేస్తారు. ఈ రెండిటి వల్ల శరీరంలో ఉండే టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి. వేప పువ్వుల్లో ఎంజైమ్ లు ఉండడం వలన మనలో ఉండే హానికరమైన టాక్సిన్స్ లను తొలగించడంలో సహయం చేస్తాయి.
అలానే వేప పువ్వు, బెల్లం కలిపిన మిశ్రమం తీసుకోవడం ద్వారా శరీరం బరువును, కొవ్వును త్వరగా తగ్గించే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఉగాది పచ్చడి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చక్కెర నిల్వలను సమతుల్యం (Balance) చేస్తాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో కూడా ఇవి ఎంతో ఉపయోగపడుతాయి.
ఉగాది సమయంలో వేసవి కాలం ప్రారంభమవుతుంది కనుక మనం డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఎంతో ఉంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి బెల్లం కలిపిన నీరుని తీసుకోవడం ఎంతో మంచింది. అందువల్ల ఉగాది పచ్చడి తీసుకోవడం వలన వడదెబ్బ సమస్య నుంచి తట్టుకోవచ్చు. ఉగాది పచ్చడిలో మామిడి ముక్కలు వేస్తారు. వడ దెబ్బను నివారించడంలో అవి సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
వగరు
వగరు రుచి కోసం ఉగాది పచ్చడిలో వేసవిలో వచ్చే లేత మామిడి కాయల్ని వేస్తారు. వగరు రుచి కొత్త సవాళ్లకు సంకేతం. అంటే కొత్త సంవత్సరంలో ఎదురయ్యే కొత్త సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని అంతరార్దం. అలానే లేత మామిడి పళ్ళు రక్తప్రసరణ మెరుగుపడేలా చేస్తాయి. వైద్య శాస్త్రం ప్రకారం ఇవి శరీరంలో రోగ నిరోధన శక్తిని కూడా పెంచుతాయి. డీహైడ్రేషన్, వడదెబ్బని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల కడుపులోని సమస్యల్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. చింతపండు గుజ్జు ఆయుర్వేదంలో డెడ్ స్కిన్ టిష్యూని తొలగించడానికి డీటాక్స్ చేయడానికి వాడతారు. మామిడిపండ్లు డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. మార్నింగ్ సిక్నెస్లో వికారాన్ని తగ్గిస్తాయి. గుండె, కాలేయం, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

తీపి
ఉగాది పచ్చడిలో తీపిదనం కోసం బెల్లాన్ని కలుపుతారు. ఆరోగ్య పరంగా బెల్లానికి జీర్ణక్రియను వృద్ది చేసే లక్షణం ఉంటుంది. మధురమైన రుచి కోసం ఉపయోగించే బెల్లం జీర్ణకోశ సమస్యలు, మూత్రాశయ సమస్యలు దూరమయ్యేలా చేస్తుంది. గుండె పని తీరు మెరుగవుతుంది, రక్తహీనత తగ్గుతుంది, శరీరంపై సానుకూల ప్రభావం ( Positive Effect) పడుతుంది. సహజంగా తియ్యగా ఉండడమే కాదు మలబద్ధక సమస్యని తగ్గిస్తుంది. అలానే లివర్ని డీటాక్స్ చేస్తుంది.
చేదు
ఉగాది పచ్చడిలో చేదుని ఖచ్చితంగా వాడతారు. అందుకోసం వేపపువ్వుని వేస్తారు. వేపపువ్వు చేదుగా ఉంటుంది. ఇది దాదాపు 35 ఆరోగ్య సమస్యలతో పోరాడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఉగాది పండుగ రోజు ఋతువులు మారతాయి. ఇలా మారడం వలన శరీరంలో కలిగే అనేక రోగాలకు వేప పువ్వు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలానే పిత్త దోషం తగ్గి కడుపులో క్రిములను నాశనం చేస్తుంది కూడా. మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. దీంతో పాటు బాడీ డీటాక్సీఫై చేస్తుంది. మొటిమలని తగ్గించి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చేదు బాధలకు, దు:ఖాలకు, కష్టాలకు సంకేతం. మన జీవితంలో కష్ట సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఎలాంటి బాధలు కష్టాలు దుఖాలనైనా తట్టుకొని నిలబడాలని ఉగాది పచ్చడిలో ఉండే చేదు రుచి మనకు తెలియజేస్తుంది.
ఉప్పు
ఉగాది పచ్చడిలో ఉప్పును వాడతారు. ఆయుర్వేదంగా అయితే సైంధవ లవణం ఉప్పుకు బదులుగా వాడచ్చు. ఉగాది పచ్చడిలో వాడే ఉప్పు వాతాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. ఉప్పులేని లేని కూర చప్పగా ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. అంటే ఉప్పు తినని మనిషి జీవితం నిస్సారంగా కొనసాగుతుంది. ఉప్పు ఉత్సాహాన్ని, శక్తిని కలుగజేస్తుంది. అందుకే ఏడాది మొత్తం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు ఉగాది పచ్చడిలో ఉప్పును వాడతారు. ఉప్పు శరీరంలో సోడియం నష్టాన్ని తగ్గిస్తుంది. సోడియం ఉండడం వల్ల డీహైడ్రేషన్‌ని తగ్గించి ఐరన్ కంటెంట్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. దంత ఆరోగ్యాన్ని కాపాడి, బ్రెయిన్ పనితీరుని మెరుగ్గా చేస్తుంది. డీహైడ్రేషన్, ఆర్థరైటిస్ సమస్యని తగ్గిస్తుంది.
కారం
ఉగాది పచ్చడిలో కారానికి సూచనగా మిరియాలు లేదా చిల్లీ పౌడర్ ని వాడతారు. మన శరీరంలో ఉండే కొన్ని క్రిములు ఎన్ని మందులు వాడినా తొలగిపోవు. పైగా శరీరానికి ఎంతో హాని కలుగజేస్తాయి. కనుక కారం కడుపునొప్పిని, చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇవి ఇమ్యూనిటీని అనగా వ్యాధి నిరోధక శక్తిని పెరిగేలా చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలనున్నాయ్. ఇది ఊపిరితిత్తులకి మంచిది. శరీరంలో ముఖ్యమైన పంచేంద్రియాలు చురుకుగా పని చేయడానికి కారం ఉపయోగపడుతుంది. అంతేకాక కారం కఠిన పరిస్థితులకు సంకేతంగా ఉంటుంది. అందుకే నూతన సంవత్సరంలో ఎదురయ్యే ఎలాంటి కఠినతరమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని తెలిపేందుకు ఉగాది పచ్చడిలో కారం ఉపయోగిస్తారు.
పులుపు
పులుపు రుచి కోసం ఉగాది పచ్చడిలో కొత్త చింతపండును వాడతారు. కఫం, వాతం మొదలైన రుగ్మతలను ఇది నివారిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. నూతన సంవత్సరం అంతా విసుగు చెందకుంగా ఓర్పుగా సహనంతో ఉండాలని అంతరార్ధంగా ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వాడతారు.
గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.