శ్రీకృష్ణదేవరాయల వారి చరిత్ర
విజయనగర సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ రాజు కృష్ణదేవరాయలవారు. ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని అత్యంత ముఖ్యమైన సమయంలో పరిపాలించారు. ఆయన భారతదేశపు గొప్ప రాజులలో ఒకరిగా పరిగణించబడ్డారు. కృష్ణదేవరాయల పాలన అనేక భాషల్లో మంచి సాహిత్యంతో కలిగివున్నాయ్. తెలుగు సాహిత్యంలో అతని పాలన కాలాన్ని “స్వర్ణయుగం” అని పిలుస్తారు.

“శ్రీకృష్ణదేవ రాయలు” విజయనగర చక్రవర్తి. ఇతను 20 సంవత్సరాల వయస్సులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించారు. పరిపాలన సమయం వచ్చేసి “1509 ఫిబ్రవరి 4 నుంచి 1529 అక్టోబరు 17 వరకు. రాయలవారి పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితికి చేరుకుంది. కృష్ణదేవారాయలవారిని భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకరిగా తెలుగు, కన్నడ ప్రజలు ఎంతగానో అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతను కీర్తించబడ్డారు.
విషయ సూచిక
శ్రీకృష్ణదేవరాయల జీవిత విశేషాలు
శ్రీకృష్ణదేవరాయలవారు సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పని చేసిన తుళువ నరసనాయకుని 3వ కుమారుడు. నరసనాయకుడు పెనుకొండ పట్టణంలో ఉండగా, ఆయన 2వ భార్య నాగలాంబకు రాయలు జన్మించారు. కృష్ణదేవరాయలు వారి తల్లి నాగలాంబ గండి కోటను పాలించిన పెమ్మసాని నాయకుల ఇంటి ఆడపడచు.

సాహిత్యములో కృష్ణదేవరాయలని ఆంధ్ర భోజుడుగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డారు. ఈయన పాలన గురించి సమాచారం పోర్చుగీసు సందర్శకులైన డొమింగో పేస్, న్యూనిజ్‌ల రచనల వలన తెలుస్తుంది. రాయలుకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు ఎంతో ప్రయత్నించారు. కృష్ణరాయలు తిమ్మరుసును తండ్రి సమానుడిగా గౌరవించి “అప్పాజీ” (తండ్రిగారు) అని పిలిచేవారు. రాయలు ఇతను 20 సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించారు. ఇతని పట్టాభిషేకానికి అడ్డు వచ్చే అచ్యుత రాయలునూ, వీర నరసింహ రాయల్ని, వారి అనుచరుల్ని తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గముల్లో బంధించాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవారు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబలం కలిగినవాడు, ఆర్థికవేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువనివాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలలైన సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించారు. కృష్ణదేవరాయలు 1529 అక్టోబరు 17న మరణించారని 2021 ఫిబ్రవరిలో, కర్ణాటకలోని తుముకూరు వద్ద బయటపడిన శాసనం ద్వారా తెలిసింది.
శ్రీకృష్ణదేవరాయల సాహిత్య పోషణ
కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదు ఉంది. స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్య వధూప్రీణనము, సకల కథాసారసంగ్రహము, జ్ఞాన చింతామణి, రసమంజరి మరియు తదితర గ్రంథాలు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించారు.

“తెలుగదేలయన్న, దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొల్వ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స!!!!”
ఈ మాటలు రాయల వారు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అనే పేరుంది. భువన విజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి కవి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే 8 మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు “అష్టదిగ్గజములుగా” ప్రఖ్యాతి పొందారు.
భక్తునిగా శ్రీకృష్ణదేవ రాయలు
కృష్ణదేవరాయలవారు తక్కిన విజయనగర రాజుల్లాగే వైష్ణవుడు. కానీ పరమత సహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించారు. అంతేకాక ధూర్జటి కవి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించారు. అనేక దాన ధర్మాలు చేసారు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు. సుమారుగా 7 పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశారు. ఇతను తన కుమారునికి తిరుమల దేవరాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నారు.
శ్రీకృష్ణదేవ రాయల కుటుంబము

కృష్ణదేవరాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలు. అయితే, దేవరాయలు వ్రాసిన ఆముక్తమాల్యద ప్రకారం ఇతనికి ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ, కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు అయిన తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజ నర్తకి అయిన “చిన్నాదేవిని” వివాహమాడారని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతిని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రక ఆధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా పిలిచేవారు. చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించారు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ వాళ్ళలో తిరుమలాదేవి,
చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా చెప్పబడిన తిరుమలాదేవి పట్టపురాణి
అయ్యుండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.

ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామరాయలకు, చిన్న కూతురును రామరాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి పెళ్లి చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న వయసులోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524లో కాలంచేసాడు. ఈ విషయంపై కృష్ణదేవరాయలు తిమ్మరుసును అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. అయితే మరణానికి మునుపు చంద్రగిరి దుర్గములో ఉన్న సోదరుడు అచ్యుత రాయలును వారసునిగా చేసాడు.
శ్రీకృష్ణదేవ రాయల మతము, కులము
శ్రీ కృష్ణ దేవరాయలు వ్రాసిన ఆముక్తమాల్యద ప్రకరం ఆయన విష్ణు భక్తుడు అని తెలుస్తుంది. అయితే శ్రీ కృష్ణ దేవరాయలు ఏ కులానికి చెందినవాడు అన్న విషయంపై సాహిత్యవేత్తల్లోను, చరిత్రకారుల్లోను భిన్నమైన అభిప్రాయాలున్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తండ్రియైన తుళువ నరస నాయకుడు బంటు అనే నాగవంశపు క్షత్రియ కులానికి చెందినవాడని కొన్ని చరిత్ర పుస్తకాలు తెలియజేస్తున్నాయి. శ్రీ కృష్ణ దేవరాయల తల్లి పేరు నాగలాదేవి. ఆముక్తమాల్యదలోని 19వ పద్యము ప్రకారము శ్రీ కృష్ణ దేవరాయలు చంద్రవంశమునకు చెందినవాడని, 22, 23, 24 పద్యాల ప్రకారం శ్రీ కృష్ణ దేవరాయల ముత్తాత అయిన తిమ్మరాజు యయాతి వంశస్థుడు అని తెలుస్తుంది. కొన్ని సాహిత్య పుస్తకాల ప్రకారం శ్రీకృష్ణ దేవరాయలు కురూబు యాదవుడని రచయితలు రాశారు. ఇందుకు అష్టదిగ్గజాలలో ఒకరైన తిమ్మన కవి రచించిన పారిజాతాపహరణంలో శిలాశాసనాల్లో వ్రాయబడింది.