కుంజర యుద్దంబు దోమ కుత్తుక జొచ్చెన్ | తెనాలి రామకృష్ణ పద్యాలు

అలనాటి కవుల చెప్పినటువంటి పద్యాలలో నుఘూడ విషయాలు దాగి ఉంటాయి. పైపైన చదివితే విమర్శలకు దారి తీస్తుంది కానీ పరిశీలించి విషయాన్ని తెలుసుకుంటే అందులో ఉన్న అర్ధం తెలుస్తుంది.

ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరణకి ఇవ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనాలి రామలింగడి పూరణః

గంజాయి త్రాగి తురకల
సంజాతల గూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా ఎచ్చట
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్

అని సమస్యను పూరించడంతో తేలుకుట్టిన దొంగల్లా తాతాచార్యులు, భట్టుమూర్తి కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అయితే ఎలాగైనా రామకృష్ణుడికి బుద్ధి చెప్పాలని రాయల వారికి ఫిర్యాదు చేస్తారు. రాయల వారు వికటకవిని పిలిచి అదే సమస్యను ఇచ్చి పూరించమంటాడు. అపుడు రామకృష్ణుడు తెలివిగా ఈ క్రింది పద్యం చెబుతాడు..

రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
సంజయా! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !

అది విని రాయలవారు "శభాష్! రామకృష్ణా! నీ బుద్ధి బలానికి రెండు ప్రక్కల పదునే" అని మెచ్చుకుంటాడు.

♦ కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ అంటే... ఏనుగుల గుంపు వెళ్లి దోమ యొక్క గొంతులో దాక్కున్నాయట. శరీరం రీత్యా కాదు శక్తి రీత్యా.
పాండవులు ఏనుగుల వలే చాలా శక్తి వంతులు. కాని విరాట రాజు వాళ్ళ ముందు చాలా బాలహీనుడు (దోమ వలె). మహావీరులైన పాండవులు నిస్సహాయులై విరాటరాజు కొలువులో ఊడిగం చేసిన ఇతివృత్తం ఏనుగుల సమూహం దోమ గొంతులో చొరబడినట్టుగా అగుపిస్తుంది అని రామకృష్ణుడు చక్కగా చెప్పాడు.

కవులు ఎంతకైనా సమర్ధులే కదా!!!