చాణక్య నీతులు (భాగం - 1)
చాణక్య నీతులు (భాగం - 1)
చాణక్యుడిని కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ నీతిశాస్త్రం నుంచి విషయాలు కొన్ని భాగాలుగా మీకోసం...
1. ప్రజల సుఖమే పాలకులకు సుఖము. ప్రజల హితమే పాలకులకు మంచి.
2. పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రదేశములలో గృహములను నిర్మించాలి. ఆ గ్రామములలో తటాకములు నిర్మించాలి. దీనివలన నీటి కొరత ఉండదు . రెండవ పంటకు కూడా ఈ తటాకాలు ఉపయోగపడతాయి.
3. ఆనకట్టల నిర్మాణం జరపాలి. నీటిని వృధా కానీయరాదు. ప్రతి చుక్కా విలువైనదే.
4. వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించాలి. కాలువలు, చేరువుల ద్వారా వ్యవసాయానికి అనూకూల పరిస్థితులు కల్పించాలి.
5. పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయలి. దీనివలన పశువులకు గ్రాసం లభించి పాడి అభివృద్ధి చెందుతుంది.
6. వ్యాపర మార్గాలు ఏర్పాటు జరపాలి. వాణిజ్య సౌకర్యాలు మెరుగుపడటం వలన దేశ ఆదాయం పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉండదు.
7. విదేశీ వ్యవహారాలలోనూ, దేశ రక్షణలోనూ అప్రమత్తత కలిగిఉండాలి. లేదంటే ఇతరులు చొరబాట్లకు అవకాశం కల్పించినట్లు అవుతుంది.
8. దేశక్షేమం కోరే పాలకులు క్లిష్ట పరిస్థితులలో శత్రువులతో కూడా స్నేహం చేయవలసిన పరిస్థితి ఉంటుంది.
9. దేశానికి ఆదాయాన్ని ఇచ్చేదే అయినా ప్రజలకు నష్టం కలిగించే వాటిని వదిలేయాలి. (కాని నేటి పాలకులు ప్రజలను నాశనం చేసే ఎన్నిటినో దేశంలోకి అనుమతులు మంజూరు చేశారు. చేస్తూనే ఉన్నారు.)
10. ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడు పాలకుడు అనుక్షణం ప్రజల యోగక్షేమాలు విచారించి తగిన రక్షణ కల్పించాలి.
11. ధర్మరక్షణకు రాజు కఠినముగా ప్రవర్తించాలి. (నేడు అధర్మ రక్షణ బాగా పెరిగిపోతుంది. కూనీలు, కుట్రలు, చేసినవారికి, గజదొంగలకి, రక్షణగా అనేక చట్టాలు వత్తాసు పలుకుతున్నాయి.)
12. పాలకుడు ప్రజలను ఆకారణముగా దండిస్తే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుంది. (ఈ విషయంలో ప్రజలు ఒకడుగు ముందుకేసి పొతేపోనివ్వండి అనుకుంటూ దిక్కుమాలిన బ్రతుకులు బ్రతికేస్తున్నారు.)
Comments (0)
Facebook Comments (0)