అట్ల తద్ది

అట్ల తద్ది

అట్ల తద్ది

 

అట్ల తద్దె, శనివారం, 27th October 2018

సమయం:
తద్దె రోజున చంద్రోదయం = సాయంకాలం 7:55 PM
తదియ తిథి మొదలు = సాయంకాలం 8:09, 26-October-2018
తదియ తిథి ముగింపు = సాయంకాలం 6:37, 27-October-2018

"అట్ల తద్ది" వ్రతం అనేది ఇప్పట్లో చేసుకోవడం చాలా తగ్గిపోయింది. అసలు "అట్ల తద్ది" అంటే ఏంటి అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారంటే మనం అర్ధం చేసుకోవాలి మన సంప్రదాయాలు ఎంతలా కనుమరుగైపోతున్నాయో. 

చంద్రోదయ ఉమావ్రతం అట్లతద్ది అనే పేర తెనుగునాట బాగా ప్రచారంలో ఉంది. ఈ దినాన స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమాదేవిని పూజించి భుజిస్తారు. ఈ పూజ, ఈ పర్వం తెనుగునాట చిరకాలంగా బాగా ఆచరణలో ఉన్నట్లు కనిపిస్తుంది.Related image అష్టాదశ వర్గాలకు అట్లతద్ది' అని సామెత ఒకటి తెనుగులో ఉండడం ఇందుకు మరోబలం. అట్ల తద్దికి ముందురోజును అట్లతద్ది భోగి అంటారు. ఆనాడు ఏం చేస్తారు ? స్త్రీలందరూ తలంటి పోసుకుంటూరు, వేళ్లకు, కాలి గోళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారకట్లే అనగా తొలి కోడి కూసినప్పుడే లేచి ఉట్టికింద కూర్చుని చద్ది భోజనం చేస్తారు. తాంబూలం వేసుకుంటారు. ఇక అప్పటి నుంచి తెల్లవారే వరకు మరి నిద్రపోరు. కొత్తబట్టలు కట్టుకుని ఆటలతో పాటలతో కాలక్షేపం చేస్తూ వేగిస్తారు. ఊయెలలు ఊగుతారు. ఇక ఆ పగటిపూట భోజనం చేయరు. భోజనం చేయకపోయినా తాంబూలం మాత్రం సేవించడం కొన్ని కులాల, కొన్ని ప్రాంతాల ఆచారమై ఉంది. రాత్రి వరకు ఉపవాసం ఉండడం వల్ల నోరు ఎండుతూ ఉంటుంది. అట్లా నోరు ఎండకుండా ఈ తాంబూల సేవనం కాపుదలగా ఉంటుందని చెబుతారు.

అయిదేళ్లు దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు దీనిని చేసుకుంటారు. అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే, వివాహితులు మంచి భర్త దొరికినందుకు, అతడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. సాధారణంగా వివాహమైన తర్వాత పదేళ్లపాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి, సమాప్తం అయిందనడానికి గుర్తుగా ఉద్యాపన చేస్తారు. అంటే చివరిసారి పూజచేసి ముత్తైదవులను పిలిచి వాయినాలిచ్చి కన్నుల పండువగా ముగిస్తారు.త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతిదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యం కోసం చేసుకొనే వ్రతం. 

మినపప్పు, బియ్యం పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువునకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. గర్భస్రావం రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తైదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి శాస్త్రీయ విజ్ఞానం నిక్షిప్తం చేయబడింది.


అట్ల తద్ది: మంచి భర్తని ప్రసాదించే ఆ వ్రతాన్ని ఎలా చేస్తారు?


తాంబూలం రంగు నోటికి ఎంత ఎర్రగా పండితే వాళ్ళ వాళ్ళ భర్తలు వారిని అంతగా ఆదరిస్తారని నమ్ముతారు. పొద్దుపొడిచాక స్త్రీలు అలంకరించుకొని తోటల, దొడ్లవెంట తిరిగి సాయంకాలము తాము చేయబోయే పూజకు పువ్వులు, పత్రి సంగ్రహించుకుని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ పగలు వీలయినప్పడల్లా ఉయ్యాల ఊగుతారు. ఈ ఉయ్యాలలు ఇళ్లల్లో కాక తోటల్లో దొడ్లల్లో పెద్దచెట్లకు వేసినవిగా ఉంటాయి. సాయంత్రం ఉమాదేవినిఅట్ల తద్ది పూజించీచంద్ర బింబము చూచి అట్లని పిండివంటలతో భోజనం చేయిస్తారు. ఇది అట్లతద్ది నాటి తెలుగుస్త్రీల కార్యకలాపం. అట్లతద్దిని ఆచరిస్తే ముసలి మొగడు రాడు అని ప్రతీతి. దీనిని ఒక విధముగా అనవచ్చు, తోటలలో దొడ్లలో విలాసంగా తిరుగుతూ పత్రి సేకరించడం, యధేచ్ఛా విహారంగా ఊయెలలు ఊగుతూ వినోదించడం అంగనలకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. నగర స్త్రీల కంటె పల్లెటూళ్లపడతులు ఈ పండుగను ఎక్కువగా, మనోజ్ఞంగా అనుభవిస్తారు. తెల్లవారగట్ల చద్ది అన్నం గోంగూర పచ్చడి, నువ్వుల గుండ, ఉల్లిపాయ పులుసు మున్నగువానితో తినకపోయినా అట్లతద్ది నోము నోచకపోయినా గోరింటాకు పెట్టుకోకపోయినా, ఉయ్యాల ఊగకపోయినా ముసలిమొగుడు వస్తాడని భయపెట్టి ఈ పనులన్నీ ఆడపిల్లలు అతిశ్రద్దగా చేసేటట్లు తెలుగుగృహిణులు జాగ్రత్తవహిస్తారు. రాజులు, కాపులు మున్నగు కులాల వారిలో ఈ పండుగ బాగా అమల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి అయిన పడుచులకు ఈపండుగకు తగవులు కావిళ్లతో పంపుతారు. క్రొత్తడికి పసుపు, కుంకుమలు, చీర, రవికెల గుడ్డ ఒక సువర్ణాభరణం ఆమె పేరంటాళ్లకు పెట్టుకొనేందుకు అరటిపళ్లు, కూరలు మున్నగు సంబారాలు విరివిగా పంపుతారు. తెల్లవారగట్ల ముతెదువలతో కలిసి భోజనం. పగలు భోజనం చేయకుండా ఉండాలి. చంద్రోదయమైన పిమ్మట పూజ చేసి ముత్తైదువులకు సరస పదార్థ సంపన్నమైన అన్నం పెట్టి తాను భోజనం చేయాలి. ఇది 'చంద్రోదయోమా వ్రతం' చంద్రుడు ఉదయించిన తరువాత గౌరిని కొలిచే వ్రతం. అయినా కోమటి బ్రాహ్మణుల ఇళ్లలో గౌరీపూజ అట్లతద్ది నాటి మధ్యాహ్నమే జరిపించడం ఆచారంగా ఉంది. అట్లనైవేద్యం పెట్టి మధ్యాహ్నమే భోజనం చేసివేస్తారు.

మిగతా కులాల్లో ఆచారం ఇందుకు భిన్నంగానూ, శాస్త్రీయంగానూ ఉంది. ఆ కులాల్లోని వారుసాయంత్రం గౌరీ పూజను నీలాటిరేవున చేస్తారు. చంద్రదర్శనం అయ్యాక భోజనం చేస్తారు. అట్లతద్దెనోము నోచుకుంటే కన్యలకు ముసలి మగడురాడు. పెళ్లి ఐన వాళ్లకు నిండు ఐదవతనం కలుగుతుంది. అట్లతద్దికి గోదావరినీళు అట్లలాగ విరిగిపోతాయి.

పది రకాల ఫలాలను తినడం, పది మార్లు తాంబూలం వేసుకోవడం, పదిసార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఈపండుగలో విశేషం. దీనినే 'ఉయ్యాలపండగ' అనీ, 'గోరింటాకు పండగ' అనీ అంటారు. ఈపండగ చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి అవివాహిత యువతులకు గుణవంతుడు, అందగాడైన వ్యక్తి భర్తగా లభిస్తాడని, పెళ్లనవారికి సంతనం కలుగుతుందని, ఐదోతనంతోపాటు, పుణ్యం లభిస్తాయని నమ్మకం. అట్ల తద్దోయ్... ఆరట్లోయ్, ద్దపప్పోయ్... మూడట్లోయ్, ప్ప చిప్ప గోళ్లు, సింగరయ్య గోళ్లు.మా తాత గోళ్లు, మందాపరాళ్లు అంటూ పాడుకుంటారు.

బడిబడినట్లతద్దె యను పండుగ వచ్చిన సంతసిల్లుచున్ వడిందెలవారు చుక్కబొడువం గని లేచి సమస్త బాలికల్ మడినిడి పాట్లకాయ పరమానము నన్నము మెక్కియాటలన్ బడివునాcటనుయ్యెలలపైదగనూగుట జాడనొప్పదే - అనేది ఒక పద్యం "తెలుగునాడు" దాసు శ్రీరాములు రాశారు. అట్లతద్ది నాడు గోరింటాకు ఏడాదిలో తెలుగు స్త్రీలు గోరింటాకు తప్పకుండా పెట్టుకొనే మూడుపండుగలలో అట్లతద్ది ఆఖరుది. నఖరంజని ఆషాఢమాసంలో ఒకసారి, భాద్రపదమాస మధ్యంలోని ఉండ్రాళ్లతద్దికి ఒకసారి, ఆశ్వయుజమాస మధ్యంలోని అట్లతద్దికి ఒకసారి మొత్తం ఏడాదిలో మూడు సారులు తెనుగు తెరవలు గోరింటాకు పెట్టుకుంటారు. ఆ పెట్టుకోవడంలో చేతివేళ్లకు, గోళ్లకు అరచేతులకు, పాదాలకు, అరిపాదాలకు, కాలిగోళకు సుదుటివూద బొట్టుపెట్టుకునేచోట పెట్టుకుంటారు. ఇన్ని చోట్లపెట్టుకొనేది అయినా గోళ్లకు అలంకారమునకు ఆరూఢమైంది." గోళ్లకు పెట్టుకునేది అనే నామమేసంస్కృతంలో నఖరంజని అనే పేరు ఉంది. నఖరంజని అనగా గోళ్లకు రంగు కలిపించేది అని అర్థం. తెనుగు పేరైన గోరింటకు కూడా ఇదే అర్ధమని బ్రౌనుదొర సూచిస్తున్నాడు. గోరింట గోరింట గోరు+అంటు' అని. గోరింట విషయంలో కొన్ని విధి నిషేధాలు ఉన్నాయి. దీనని బాలికలు, ముత్తయిదువులు మాత్రమే పెటుకుంటారు. మగవాళు పెట్టుకోరు. చిన్నారి మగపిల్లలు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆడవాళ్లకే పరిమితమైనదని తేలుతూ ఉంది. ఆడవాళు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యదృష్ట్యా వాళ్ళు పనిపాటలు చేయడంలో తరచు నీళు వాడుతూ. చెమ్మలో, ఎండలో తిరుగుతూ ఉండాలి. పేడ, మనవి బూడిద మున్నగునవి ముట్టుకుంటూ ఉండాలి. ఈ చర్యల వల్ల వాళ్ల మన్నూ మశానమూ, రోగకారక క్రిములు చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలి వేళ్లసందున ఎల్లిపోవడం కూడా ఉంటుంది. గోరింటాకు పెట్టుకోవడంవల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వాటిని అంటిపెట్టకుండే విషక్రిములు నశిస్తాయి. అవీ పిప్పి గోళ్లు కాకుండా క్రాఫ్టుదలగా ఉంటుంది. గోరింట పెట్టుకున్నవాళ్ల వ్రేళ్లసందున ఎంసిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. గ్రీష్మ ఋతువుకు చెందిన ఆషాఢమాసము వర్షఋతువుకు స్వాగతం చేసేమాసం. వర్ష ఋతువుకి చెందిన భాద్రపదమాసంలో ఉండ్రాళ్లతద్ది నడివర్షాకాలపు పండుగ. శరదృతువుకు చెందిన ఆశ్వయుజమాస మధ్యంలో వచ్చే అట్లతద్ది కడవానకారుపబ్బం. ఈ మూడు పర్వసందర్భాలలో గోరింటాకు పెట్టుకుని తమ గోళ్ల ఆరోగ్యం, అందం కాపాడుకునే ఆచారం ఇట్లు పండుగల కార్యవిధానంలో మన పెద్దలు మేళవింపునొందించారు.