Uncategorized

వారాహిదేవి వైశిష్టత మరియు గుప్త నవరాత్రుల ప్రాముఖ్యం

వారాహిదేవి వైశిష్టత మరియు గుప్త నవరాత్రుల ప్రాముఖ్యం
Views: 8

ఈ సంవత్సరం వరాహిదేవి నవరాత్రులు జూన్‌ 26 నుంచి ఆషాఢ మాసం మొదలుకాబోతుంది. ఈ వారాహి నవరాత్రులు 2025 జూన్ 26 (గురువారం) నుంచి ప్రారంభమై జూలై 4వ తేదీ (శుక్రవారం) వరకు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారి విశిష్టతను ఆమె తత్వాన్ని వివరిస్తూ ఒక విశ్లేషణాత్మకమైన వివరణని మీకు అందిస్తున్నాం.

వారాహిదేవి వైశిష్టత

వారాహి మాత పరిచయం:

మన పురాణాల ఆధారంగా ఆది పరాశక్తి యొక్క ఏడు ప్రతిరూపాలు “సప్త మాతృకలు“. వారు మహేశ్వరి, బ్రాహ్మి, కౌమారి, ఇంద్రాణి, వైష్ణవి, వారాహి, చాముండి. దుష్టశిక్షణ మరియు భక్త రక్షణకు ఈ సప్తమాతృకలు అవతరించాయి.

వారాహి నవరాత్రులు / గుప్త నవరాత్రులు అనేవి ఏంటి?

ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి ఆషాడ శుద్ధ నవమి వరకు ఉన్న సమయమే వారాహి నవరాత్రులు. హిందూ సంప్రదాయంలో ఉన్న నాలుగు నవరాత్రులలో ఎంతో మహిమాన్వితమైనవి, శక్తివంతమైనవి ఈ నవరాత్రులు. ఎవరైతే ఈ ఆషాడ మాస గుప్త నవరాత్రుల్లో నిచ్చలమైన మనసుతో, శ్రద్ధతో, భక్తితో ఆ తల్లిని ఆరాధిస్తారో వారి సమస్యలన్నీ ఆ తల్లి అనుగ్రహంతో ఖచ్చితంగా తీరుతాయి.

పురాణ ప్రస్తావన:

వారాహి దేవి గురించి లలితా దేవి సహస్రనామాల్లో, దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ప్రస్తావించబడి ఉన్నాయి. దుర్మార్గ శక్తులను అంతమొందించటడం (సంహరించడానికి) కొరకు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అనుచరిగా, సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహిని దేవి అవతరించింది.  అంథకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి అసురులను సంహరించినట్లు ఆయా పురాణాల్లో ప్రస్తావించారు.

Picture Credits: Devaseva

అమ్మవారి వర్ణన:

లోక రక్షణకు , దుష్ట శిక్షణకు భగవంతుడు ఎన్నో అవతారాలలో ఉద్భవిస్తుంటాడు. అలాగే పూర్వకాలమున హిరణ్యాక్షుడు అనే అసురుని సంహరించడానికి గాను, భూలోకాన్ని రక్షించడానికి గాను స్వీకరించిన అవతార స్వరూపమే వరాహమూర్తి. ఆ వరాహ రూపం ” స్త్రీ తత్వమే” ఈ వారాహి స్వరూపం.
వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో కనిపించే పరమకృపామయి. సాక్షాత్తు వరాహమూర్తి స్వరూపాన్ని పోలి ఉంటారు. నల్లని మేఘవర్ణంలో శరీర ఛాయను కలిగి ఉంటారు. వరాహముఖియై, అష్టభుజాలతో , అభయ – వరద హస్తాలతో, శంఖం, హలం, పాశం వంటి ఆయుధాలతో దర్శనమిస్తారు. దున్నపోతు, పాము, సింహం, గుర్రం ఈ తల్లి వాహనాలు.

  • అమ్మవారి తత్వం

వారాహి అమ్మవారు శత్రునాశనకారిని ,రహస్య జ్ఞానప్రదాయని , రాత్రి పూజలలో అత్యంత ప్రధానవంతమైన దేవత. అష్టలక్ష్మి రూపాల్లో ఒక రూపంగా భావించబడుతుంది.

  • నవరాత్రి పూజా విధానం

ఏ వ్రతమైన, పూజ అయిన మొదట విఘ్నేశ్వరుడుని పూజించాలి. ఎలాంటి ఆటంకాలు రాకుండా నవరాత్రి పూజ జరగాలని స్వామివారిని సంకల్పించుకోవాలి. తరువాత లలితాదేవి పరివారాన్ని తలుచుకొని వారాహి అమ్మ నవరాత్రుల దీక్షను మొదలు పెట్టాలి.

  • చదువుకోవాల్సినవి:

వారాహి దేవి ద్వాదశ నామాలు 9 సార్లు, వారాహి కవచం, స్తుతి , కాలభైరవాష్టకం మనకు ఎంత కుదిరితే అంత వీలును బట్టి చదువుకోవచ్చు. అమ్మ నామస్మరణతో, సదా ఆ తల్లి ధ్యానంలో ఉండాలి.

  • నైవేద్యాలు:

పులిహార, బెల్లంపానకం, గోధుమ రవ్వతో చేసిన లడ్డులు, దానిమ్మ గింజలు , తీపి దుంపలు, పెరుగన్నం మిరియాల పొడి అన్నం ,జిలేబి, బీట్రూట్ క్యారెట్ వంటి భూమిలో పండిన ఏవైనా సరే శుభ్రం చేసి ఆ తల్లికి నివేదన చేయాలి. సువాసన భరితమైన ఎర్రని పుష్పాలు అమ్మకు ఇష్టం.

  • దీక్ష విధానం:

నవరాత్రులను ప్రారంభించే ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా ద్రవ్యాలు అనగా పసుపు ,కుంకుమ, అక్షింతలు, ఎర్రని పువ్వులు, నూనె , సాంబ్రాణి సిద్ధంగా ఉంచుకోండి. అవకాశం ఉంటే మీ పూజ గదిలో ఒక పీటను సిద్ధం చేసి దాని మీద ఎర్రనివస్త్రం పరిచి అమ్మవారి పటాన్ని గాని, విగ్రహాన్ని గాని ఉంచండి. కొందరి అపోహల వల్ల , అభిప్రాయాల వల్ల ఇంట్లో వారాహి అమ్మవారిని ఉంచడానికి భయపడుతుంటారు. అలాంటివారు లలితాదేవి చిత్రపటం కానీ లేదా దుర్గాదేవి చిత్రపటాన్ని గాని, విగ్రహాన్ని గాని పెట్టి పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతి కాబట్టి దీక్ష వస్త్రాలు ఎర్రనివై ఉండాలి. స్త్రీలు ఎర్రని గాజులు ఎర్రని వస్త్రాలు ధరించాలి. అవి లేనివారు కనీసం ఎర్రని కండువా అయినా మెడలో ధరించాలి.

ముందుగా వినాయకుని పూజతో సంకల్పం మొదలుపెట్టి ఆ తల్లికి అష్టోత్తరాలు, సహస్రనామాలతో మీ వీలును బట్టి కుంకుమార్చన చేయండి. కుంకుమ పూజ ఎంతో విశేషమైనది. పూజ అనంతరం ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల ఆ తల్లి కృపకి పాత్రులమవుతాము. ఈ నవరాత్రులు ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేసి అమ్మవారికి దీప, ధూప, నైవేద్యాలు పెట్టాలి. పాదరక్షలు ధరించకూడదు. మద్యం, మాంసం స్వీకరించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి కేవలం నేలపైన చాప వేసి పడుకోవాలి. అవకాశం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు అఖండ దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే వాస్తు దోషాలు , చెడు ప్రభావాలు తొలగిపోతాయి. అలాగే నవరాత్రుల్లో రక్షా కంకణాలు కూడా పెట్టుకొని పూజ అయ్యాక చేతికి ధరించండి. ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు లేదా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ కండువా ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

ముగింపు:

ప్రతిరోజు అమ్మవారికి పూజ, నైవేద్యం, మంగళహారతి, కొబ్బరికాయ కొట్టి పూజ ముగించాక కండువా తీసి పక్కకు పెట్టాలి. ఏ సమస్యలతో మనం సంకల్పం చెప్పుకున్నాము అవి పరిష్కారం చూపమని అమ్మ వారిని మనసారా వేడుకోవాలి. మరొక విశేషమేమిటంటే ఈ తల్లికి సాధారణ రోజుల్లో కొలుచుకునేవారు ” శుక్రవారం’ మరియు ” పంచమి” తిథి కలిసి వచ్చిన రోజున పూజ ఆరంభించాలి. మూల మంత్రంతో 5 శుక్రవారాలు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం కూడా ఐదు లడ్డూలు సంఖ్య రూపంలో సమర్పించుకోవాలి .

వారాహిదేవి మూల మంత్రం

ఓం ఐం హ్రీమ్ శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతీ వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అన్ధే అన్ధిని నమః రున్ధే రున్ధిని నమః జమ్భే జమ్భిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంబిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్సర్వ వాక్ సిద్ధ సక్చుర్ముఖగతి జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఠః ఠః ఠః ఠః హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||

వారాహి మూల మంత్రం ఒక్క రోజులో 3 లేక 21 లేక 108 సార్లు, 48 రోజుల పాటు , జపించినచో మీ జాతకం లోని కాలసర్ప దోషం లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి. బ్రహ్మ ముహూర్తం లో వారాహి దేవీ ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

ఫలితాలు:

శత్రు బాధల నుండి విముక్తి, రహస్య విజ్ఞానం పొందడం, అధ్యాత్మిక శక్తి పెరగడం, కుటుంబ రక్షణ, ఆర్థిక స్థిరత్వం కలిగి అమ్మవారి కృపకు పాత్రులమవుతాం. ఈ తల్లి ఆరాధన అత్యంత శుభప్రదం. ఎటువంటి తీవ్ర సమస్యలకైనా పరిష్కారాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ నవరాత్రులని శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన అభీష్టాలు తీరుతాయి ముఖ్యంగా భూ సంబంధ సమస్యలు, కోర్టు కేసులు, శత్రు సమస్యలు ఉన్నవారు , తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, జీవితంలో స్థిరత్వాన్ని కోల్పోయిన, రక్షణ కోసం ఆ తల్లిని ఆరాధిస్తే అన్ని అరిష్టాలు తొలగి అద్భుతమైన మార్పులు మన జీవితాలకు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

🙏శ్రీ మాత్రే నమః🙏

What’s your response?
2 responses
Love
Love
0
Smile
Smile
1
Haha
Haha
0
Sad
Sad
0
Star
Star
1
Weary
Weary
0

Leave a Reply