Aghora Chapter 6 – Part 3 Telugu | To Die While Still Alive | జీవించి ఉండగానే మరణించడం
🕉️ Aghora – At The Left Hand Of God
✍️ Written by Robert E. Svoboda
📖 తెలుగు అనువాదం by Rushivarya – The Vaidic Icon®
Aghora Chapter 6 – Aghora | Part 3: Devotion to the Guru
అఘోరా అధ్యయనం 6 – గురువులు | భాగం 3: జీవించి ఉండగానే మరణించడం
⚠️ గమనిక:
పుస్తకంలో మాట్లాడుతున్నది విమలానంద అఘోరి
జీవించి ఉండగానే మరణించడం అంటే మీ ఇంద్రియాలపై కలిగే అన్ని అసంకల్పిత ప్రతిస్పందనలను పూర్తిగా తొలగించడం. రుచికరమైన వంటకం కనిపించగానే నోరూరకూడదు. చనిపోయినవారికి ఆకలి వేస్తుందా? అత్యంత అందమైన స్త్రీ ఎదురుగా నడిచి వెళ్లినా, మనసులో కూడా కామోద్రేకం కలగకూడదు. చనిపోయినవారికి శృంగార ఉద్రేకం కలుగుతుందా? ఒకసారి ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత మీకు ఎదురయ్యే పరీక్షలకు అంతుండదు. మీ పరిమితి వరకు మిమ్మల్ని పరీక్షిస్తారు.
జీవించి ఉండగానే మరణించడం అంటే మీ ఎముకలను కరిగించుకోవడం. కొన్ని ప్రేతాత్మలను అస్థిపంజరాల రూపంలో ఎందుకు చిత్రీకరిస్తారో తెలుసా? శరీరం చనిపోయి కుళ్లిపోయిన తర్వాత కూడా ఎముకలు మిగులుతాయి. వాటినే ఆధారంగా చేసుకుని ఆత్మ తనను తాను గుర్తించుకుంటుందని భావిస్తారు. ఎముకలను కరిగించుకోవడం అంటే వ్యక్తిగత సంకల్పంతో ఏ కార్యమూ చేయలేని స్థితికి చేరడం. ప్రకృతి లేదా దైవ సంకల్పమే మీ ద్వారా పనిచేసే స్థితిని పొందడం.
సాగల్ షా కథ గుర్తుందా? అతని ఇంటికి తీసుకువచ్చిన అఘోరీని ఒక బుట్టలో మోసుకొచ్చారు. అతను తన స్వంత సంకల్పంతో చేసే క్రియలను అంతగా విడిచిపెట్టాడు కాబట్టి, రూపకంగా చెప్పాలంటే అతనికి ఎముకలే లేనట్టుగా ఉండేవాడు.
ఎముకలు లేని మూడు జీవులు ఉన్నాయని అంటారు: వానపాము, పిచ్చివాడు, భగవద్భావంలో పూర్తిగా లీనమైనవాడు. అఘోరీ కావాలంటే మీరు కూడా వానపాములా పూర్తిగా ఎముకలు లేనట్టుగా మారాలి. అప్పుడు మిమ్మల్ని ఎన్ని విధాలుగా మలిచినా మీరు బాధపడరు. తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు నేలకూలిపోతాయి. కానీ గడ్డి వంగి నిలబడిపోతుంది.
జీవించి ఉండగానే మరణించడం అంటే ఎండిపోవడం, తేమను కోల్పోవడం. తాజా మూలికల కంటే ఎండిన మూలికలు చాలాసార్లు ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. ఎండే కొద్దీ వాటి ప్రభావం పెరుగుతుంది. అఘోరీ కూడా అలాగే ఉంటాడు. జీవాన్ని నిలబెట్టే శరీర రసాలు క్రమంగా తగ్గిపోతాయి. శారీరకంగా చూస్తే జీర్ణరసాలు తగ్గుతాయి, సంతానోత్పత్తికి సంబంధించిన ద్రవాలు క్షీణిస్తాయి, ముఖ్యంగా నెలల తరబడి శ్మశానంలో నివసిస్తే చర్మం గట్టిగా, ముడతలు పడినట్టుగా మారవచ్చు.
అయితే శారీరక మార్పుల కంటే మానసిక మార్పులే ముఖ్యమైనవి. అఘోరీ దృష్టిలో ఈ ప్రపంచమంతా ఒక శ్మశానమే. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన క్షణమే అతని మరణం నిర్ణయించబడింది. అందువల్ల అఘోరీ దృష్టిలో అందరూ ఇప్పటికే మరణించినవారే, అస్థిపంజరాలే.
ఎండిపోవాల్సినవి శరీరంలోని రసాలు మాత్రమే కాదు. ప్రపంచానికి బంధించే కోరికలను నిరంతరం సృష్టించే మనస్సులోని “రసవత్తరమైన ఆలోచనలు” కూడా ఎండిపోవాలి. అవి మానసికంగా ఎండిపోయినప్పుడు, శారీరకంగా మీరు ఏ విధంగా జీవించినా పెద్ద తేడా ఉండదు. కానీ అవి ఇంకా మిగిలి ఉంటే, మొదట కొన్ని నియమాలు, నియంత్రణలు పాటించాల్సి ఉంటుంది. ఈ కోరికల రసాలు పూర్తిగా ఎండిపోయిన తర్వాతే నిజమైన జీవరసం అయిన అమృతం లభిస్తుంది.
జీవించి ఉండగానే మరణించడం అంటే ద్వంద్వ భావనలను పూర్తిగా ఆర్పివేయడం కూడా. పరమాత్మ ఒక్కటే; ఆయనలో ద్వంద్వం లేదు. కాబట్టి ఇష్టమైనది–అనిష్టమైనది, సుఖం–దుఃఖం, ఆసక్తికరమైనది–బోరుగా అనిపించేది వంటి అన్ని భేదాలను అధిగమించాలి. ఒక శవం ఏ విషయానికైనా స్పందిస్తుందా? లేదు. అఘోర సాధనలో విజయం సాధించాలంటే, ఈ ప్రపంచం దృష్టిలో మీరు కూడా ఒక శవంలా ఉండాలి.
ఈ అధ్యాయం జీవించి ఉండగానే మరణించడం అనే అఘోర సాధన యొక్క అంతరార్థాన్ని వివరిస్తుంది. దీని ఉద్దేశ్యం శరీరాన్ని నాశనం చేయడం కాదు; కోరికలు, అహంకారం, ద్వంద్వ భావనలు, ఇంద్రియ బంధాలను అధిగమించి పరమసత్యాన్ని అనుభవించడం. అఘోరీ దృష్టిలో నిజమైన మరణం శరీరానిది కాదు, అహంకారానిది. కోరికలు ఎండిపోయినప్పుడే అమృతత్వపు రసం లభిస్తుందని ఈ బోధనం తెలియజేస్తుంది.
శ్రీ శ్మశాన తార మాతకు అనంత కోటి నమస్కారములు 🙏🏻🔱🔥