తెలుగు, తంత్ర

Aghora Chapter 2 ‘Shakti’ Summary Telugu | మాయా శక్తి — ఆద్య శక్తి, మాయ, శక్తి తత్వాల లోతైన వివరణ

Aghora Chapter 2 ‘Shakti’ Summary Telugu | మాయా శక్తి — ఆద్య శక్తి, మాయ, శక్తి తత్వాల లోతైన వివరణ
Views: 0

🕉️ Aghora – At The Left Hand Of God
✍️ Written by Robert E. Svoboda
📖 తెలుగు అనువాదం by Rushivarya – The Vaidic Icon®

Aghora Chapter 1 – Shakti

అధ్యయనం 2 – “శక్తి
⚠️ గమనిక:
పుస్తకంలో “నేను” అనేది విమలానంద అఘోరి మాటలు

Vimalananda Aghori meditating in a cremation ground with sacred ash and spiritual aura
అఘోర మాయా శక్తి తెలుగు

నేను ఈ ప్రపంచంతో విసుగొచ్చినప్పుడు, అలసిపోయినప్పుడు, అసహనంగా అనిపించినప్పుడు — నేను ఎప్పుడూ నా “మాత” దగ్గరికి తిరిగి వెళ్తాను. నేను ఆమెను ఏ రూపంలో కోరుకుంటానో, ఆ రూపంలో ఆమె నా ముందుకు వస్తుంది. అలా మేమిద్దరం ఒక ఆటలాగా, అనుభూతులాగా జీవిస్తాము.

కొన్నిసార్లు ఆమె నా తల్లిలా, కొన్నిసార్లు ఆత్మీయ రూపంగా, ఇంకొన్నిసార్లు పసి పిల్లగా వస్తుండేది. కానీ ఒక విషయం మాత్రం నిజం — ఆమె ఎప్పుడూ నా వెంటనే ఉంటుంది. ఆమె నన్ను ఎప్పటికీ విడిచిపోదు.

ఎప్పుడో చాలా కాలం క్రితం, మేమిద్దరం ఒకరికొకరం ఒక వాగ్దానం చేసుకున్నాం — ఎప్పటికీ కలిసి ఉండాలని. ఒకవేళ ఆమె నన్ను విడిచిపెడితే, నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను.

అయితే ఆమె ఎవరు?

ఆమె “నేను” అనే నా భావన. నా శరీరంతో నేను “నేను” అని భావించే ఆ గుర్తింపు — అదే శక్తి (Shakti). ఆమె లేకపోతే నేను ఉండను. అందుకే ఆమె నన్ను విడిచిపోతే నేను చనిపోవాల్సిందే.

చాలా మందికి “నేను” యొక్క అసలు విలువ తెలియదు. అందుకే దాన్ని తప్పుగా ఉపయోగిస్తారు. కానీ నేను మాత్రం ప్రపంచంలోనే అదృష్టవంతుడిని అని భావిస్తాను. ఎందుకంటే నా శ్మశాన తారా (Smashan Tara) నాకు నా “నేను” (ego) గురించి పూర్తిగా నేర్పింది.

ఆమెను “ఆద్య శక్తి”గా (మూల శక్తి) ఎలా తెలుసుకోవాలో, ఎలా అనుభవించాలో కూడా నేర్పింది. ఆమె గురించి తెలుసుకోవడం కాదు — ఆమెనే అనుభవించి, ఆమెగా మారాల్సిన పరమ సత్యం.


మాయా శక్తి (Maya Shakti)

“మా” (దేవి) అనేది సమస్త జ్ఞానానికి మూలం. మాయలో పడే శక్తి కూడా ఆమె నుంచే వస్తుంది, ఆ మాయ నుండి విముక్తి పొందే శక్తి కూడా ఆమె నుంచే వస్తుంది. ఈ విశ్వానికి మాత్రమే కాదు, ఉండగలిగే అన్ని విశ్వాలకు ఆమెనే ఆధారం, ఆమెనే నిలబెట్టే శక్తి.

ఆమెను “ఆద్య” అని పిలుస్తారు. “ఆద్య” అంటే మొదటిదైనది, శాశ్వతమైనది — అంటే ఆమెకు ఆది లేదు, అంతం లేదు. ఆమె ఎప్పుడూ ఉన్నదే. ఇలాంటిదే విశ్వానికి పునాది కావాలి. ఆమె కూడా సృష్టి-లయలకు లోబడి ఉంటే, ఆమె ఎలా పునాది అవుతుంది? కాబట్టి ఆమె అన్నిటికీ అతీతం, కానీ అన్నిటి మూలం.


ఆమెకు ఆది, అంతం లేకపోయినా, ఆమె రెండు స్థితుల్లో ఉంటుంది — వ్యక్తమై (manifested) ఉండటం లేదా అవ్యక్తంగా (unmanifested) ఉండటం. ఆమె వ్యక్తమై ఉన్నప్పుడు, ఈ విశ్వానికి చలనశీలమైన శక్తిగా పనిచేస్తుంది. విశ్వం లయమైపోతే, ఆమె ప్రశాంత స్థితిలోకి వెళుతుంది. అది లేకపోవడం కాదు — అది నిశ్చల రూపం. శక్తి చలనంలో ఉన్నా, నిలిచిన రూపంలో ఉన్నా— అసలు శక్తి మారదు. రూపం మాత్రమే మారుతుంది.

నీకు ఎంత కష్టపడినా కొంత జ్ఞానం రావచ్చు. కానీ “ఆద్య” అయిన ఈ తల్లికి మూలం ఎక్కడుందో తెలుసుకోవడం అసాధ్యం. దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు కూడా. ఎందుకంటే అది తెలుసుకోవలసిన విషయం కాదు — అది తెలుసుకోలేనిది.

కానీ నువ్వే ఆ దేవి అయిపోతే? అప్పుడు తెలిసినది, తెలుసుకునేది అన్న భేదమే ఉండదు. నువ్వే ఆమె అయితే, ఆమె గురించి తెలుసుకోవడం అనే ప్రశ్నే ఉండదు.

ఆమెను మూడు పేర్లతో పిలుస్తారు — “మా”, “శక్తి”, “మాయ”. ఈ మూడు పదాలు ఒకే సత్యాన్ని సూచిస్తాయి కానీ మూడు వేర్వేరు కోణాలను చూపిస్తాయి.

“మాయ” అంటే మనల్ని బంధించే, మోహంలో పడేసే శక్తి.
“శక్తి” అంటే శక్తివంతమైన చలనం.
“మా” అంటే తల్లితనం — దైవ మాతృత్వం.


ప్రజలు “మాయ”ను భయపడతారు. ఎందుకంటే ఆమె పని ఏమిటంటే — ఆకర్షించడం, బంధించడం, జనన-మరణ చక్రం నుండి బయటపడకుండా ఉంచడం. కానీ నిజానికి వారు తమపై నమ్మకం లేకపోవడం వల్లనే మాయను చూసి భయపడుతున్నారు. తాము ఆమెను ఎదుర్కోలేమని భావిస్తున్నారు. ఆమె మనల్ని బంధిస్తున్నప్పుడు ద్వేషం లేదా అసూయతో చేయడం కాదు. ఆమెకు అలాంటి స్వార్థ భావాలు ఉండవు. ఆమె తన పని మాత్రమే చేస్తోంది.

మాయను చెడ్డది అంటున్న చాలామంది “స్వాములు” “బాబాలు” పూర్తిగా తప్పు మార్గంలో ఉన్నారు. ఆమె చెడ్డది ఎలా అవుతుంది? ఆమె అన్ని లోకాలకు తల్లి. నిజమైన “స్వామి” అంటే తనపై తానే అధిపత్యం కలిగినవాడు. నువ్వు నిజంగా నీపై నియంత్రణ కలిగి ఉంటే, మాయ నీపై ప్రభావం చూపలేదు కదా. అప్పుడు ఆమెను భయపడాల్సిన అవసరం లేదు. ఈ నకిలీ గురువులు చాలా విషయాలను గందరగోళం చేస్తారు, అందుకే నిజం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.


మాయ ద్వంద్వం ఉన్న చోటే ఉంటుంది. ఈ విశ్వం ద్వంద్వాలతో నిండి ఉంది. పురుషుడు/స్త్రీ, పాజిటివ్/నెగటివ్, క్రియాశీలం/నిష్క్రియ. మన తత్వం ప్రకారం, ఆత్మ ఒక్కటే , అవిభాజ్యమైనది , సత్-చిత్-ఆనంద స్థితిలో ఉంటుంది. కానీ ఆత్మకు తనను తాను అనుభవించాలంటే, ఒక “పరిశీలకుడు” అవసరం. కానీ అన్నీ ఒక్కటిగా ఉన్న స్థితిలో (అద్వైతం) పరిశీలకుడు ఉండడు.అందుకే శక్తి తనను తాను వ్యక్తపరుస్తుంది — అదే ఆద్య. ఆమెనే అన్ని విశ్వాల సమగ్ర రూపం.ఆమెకు కూడా పరిమితులు లేవు. కానీ ఆమె తనను పురుష తత్వం (ఆత్మ) నుండి వేరుగా భావిస్తుంది. అందుకే మళ్లీ కలవాలనే తపన కలుగుతుంది.


ఆద్య తన సృష్టిని ఎలా చేస్తుందో ఆమెకే తెలియదు. అది ఆనందం వల్ల జరిగే సహజ ప్రక్రియ. ఈ సృష్టి ప్రక్రియ ఎవరికీ తెలియదు — అందుకే దాన్ని “మాయ” అంటారు. తర్వాత ఈ సృష్టిలో వ్యక్తిత్వాలు (నేను అనే భావాలు) పుడతాయి. అవి తమ మూలాన్ని వెతకడం ప్రారంభిస్తాయి.

ప్రతి జీవి ఒకరోజు ఆ పరమసత్యంతో కలుస్తాడు. ఆత్మ, శక్తి వేరుగా ఉన్నప్పుడు అసంపూర్ణం. కలిసినప్పుడు అద్భుతమైన లీల జరుగుతుంది. ఆ లీల ముగిసినప్పుడు మళ్లీ మూలానికి చేరుతుంది.

ఉదాహరణ:

ఒక పెద్ద థియేటర్‌లో సినిమా చూస్తున్నావని ఊహించు.

స్క్రీన్ = పరమాత్మ (ఏకత్వం)
సినిమా ప్రొజెక్టర్ = శక్తి (ఆద్య)
సినిమాలో కనిపించే పాత్రలు = మనం (జీవులు)

స్క్రీన్ ఒక్కటే ఉంటుంది. కానీ ప్రొజెక్టర్ వల్ల కథ, పాత్రలు, భావాలు అన్నీ కనిపిస్తాయి.

ఇప్పుడు ఏమవుతుంది?

హీరో, విలన్, బాధ, ఆనందం అన్నీ నిజంలా అనిపిస్తాయి
కానీ సినిమా ముగిసిన తర్వాత?

మళ్లీ స్క్రీన్ మాత్రమే ఉంటుంది. తరువాతి షో లో, కొత్తగా వచ్చే చిత్రాల్లో మళ్ళీ ఇదే జరుగుతుంది.


ప్రజలు అడుగుతారు — “మాయ మనల్ని ఎందుకు మోహపరుస్తుంది?” అని

మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ పరమానందం యొక్క జ్ఞాపకం లోపల దాగి ఉంటుంది. కానీ అది మన శరీరంలోని పొరల ద్వారా (కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం) బయటకు వస్తూ మారిపోతుంది.

చివరికి మనకు అనుభవమయ్యే ఆనందం స్వచ్ఛంగా ఉండదు. అదే నిజమైన మాయ. అది మనల్ని కర్మలకు ప్రేరేపిస్తుంది, ఆ కర్మలు మన బంధాన్ని మరింత బలపరుస్తాయి.


మనసు ఆనందాన్ని అనుభవించినప్పుడు అనేక ఆలోచనల రూపంలో బయటకు వస్తుంది. ఇవి గత కర్మల వల్ల ఉత్పన్నమవుతాయి. ఇవి తాత్కాలికమని చాలామంది మరిచిపోతారు, లేదా వాటిని పట్టుకుంటారు, లేదా దూరం పెడతారు.

నా గురువు చెప్పినది — కోరికలను పూర్తిగా అనుభవించడం ద్వారా మాత్రమే మాయ నుండి విముక్తి పొందవచ్చు. అన్ని అపూర్ణ ఆకాంక్షలు తీరినప్పుడు మాత్రమే నిజమైన సత్యం కనిపిస్తుంది.

ఉదాహరణ: మనం ఒక పని చెయ్యాలనుకుంటాం (కోరికతోనే కర్మ పడుతుంది). పూర్తిగా చేస్తే స్వేచ్చ (సత్యం – విముక్తి). అసంపూర్ణంగా వదిలేస్తే చెయ్యలేదనే బాధ, వేరే వాటిపై మనసు నిలబడదు. (అసత్యం)


మాయ భయంకరమే. కానీ ఆమె పని భయపెట్టడం మాత్రమే. ఆమె నిన్ను నిజంగా హాని చేయదు. మన భయమే మనకు ప్రమాదం.

ఉదాహరణ: మాయ అంటే బయట ప్రపంచం — డబ్బు, పేరు, సంబంధాలు, నష్టం, భవిష్యత్తు, మరణం… ఇవన్నీ నిజంగా మనల్ని హాని చేయవు, కానీ భయపెడతాయి. డబ్బు పోతే నేను ఏమవుతాను? జాబ్ పోతే జీవితం అయిపోయింది? వాళ్లు నన్ను వదిలేస్తే?

“నేను ఏమీ కోల్పోయినా పర్వాలేదు” అని అనగలిగితేనే సాధనలో విజయం సాధ్యమవుతుంది. అఘోర మార్గంలో భయం లేకపోవడం చాలా ముఖ్యమైనది. ఒక్క సందేహం కూడా ప్రమాదం.


మాయ అనేది ఈ ప్రపంచానికి బాహ్య అలంకారం లాంటిది. అందంగా అలంకరించిన వ్యక్తి బయటకు అందంగా కనిపించవచ్చు. కానీ లోపల నిజం వేరు. అలాగే పచ్చి మామిడి ఆకర్షణీయంగా ఉంటుంది కానీ పులుపు ఉంటుంది. పండినప్పుడు మాత్రమే అసలు రుచి తెలుస్తుంది.

మాయను చూసేటప్పుడు లోపల సత్యాన్ని చూడాలి.

శక్తి అంటే చలనం. అది స్వయంగా ఉద్భవిస్తుంది. కానీ నియంత్రణ అవసరం. నియంత్రణ లేకపోతే శక్తి ప్రమాదకరం — విద్యుత్ లాంటిది. శివుడు ఈ శక్తిని నియంత్రించే తత్వం. ఆయన మూడో కన్ను (జ్ఞాన నేత్రం) తెరిస్తే ద్వంద్వం లేకుండా పోతుంది. అప్పుడు విశ్వం లయమవుతుంది. మళ్లీ అది మూసుకుంటే సృష్టి మొదలవుతుంది.


శ్మశాన తారకు మూడు కళ్ళు ఉంటాయి. అంటే ఆమె ద్వంద్వం మరియు జ్ఞానం రెండింటి కలయిక. ఆమెను ప్రేమిస్తే బాధ ఉండదు. ఎందుకంటే ఆమె నిన్ను ద్వంద్వం నుండి బయటకు తీసుకెళుతుంది. మాయను ప్రేమిస్తే బంధం. “అమ్మ”ని ప్రేమిస్తే విముక్తి.

మా (అమ్మ) ఎప్పుడూ క్రూరంగా ఉండదు. నువ్వు ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. నువ్వు మాయను కోరుకుంటే — అదే ఇస్తుంది. పూర్తిగా తృప్తి చెందే వరకు ఇస్తూనే ఉంటుంది.


తల్లి తన పాలతో పిల్లవాడిని పోషించినట్టు, ‘మా’ తన స్వరూపం నుంచే నీ కోరికలను నెరవేర్చుతుంది. నువ్వు భౌతిక కోరికలు కోరుకుంటే అవే లభిస్తాయి. ఆ కోరికలు నిన్ను పునర్జన్మల చక్రంలో చిక్కుకునేలా చేస్తాయి.
నీ ఆలోచనలు నీ తదుపరి జన్మను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు — ఎక్కువగా శృంగారం గురించి ఆలోచిస్తే, ఆ అనుభవం కోసం జంతువుగా జన్మించవచ్చు. తృప్తి వచ్చిన తర్వాత మాత్రమే తదుపరి స్థాయికి వెళ్తావు.


దేవి మనకు పాఠం నేర్పుతుంది. మాంసాహారం, హింస — ఇవన్నీ కర్మ రూపంలో తిరిగి వస్తాయి. మనుషులు జంతువుల బాధను గుర్తించరు. కానీ అనుభవం ద్వారా నేర్చుకోవాల్సిందే.

🟡 ఈ భాగాన్ని చదివినప్పుడు కొంతమందికి ఒక సందేహం రావచ్చు — “మాంసాహారం తినేవాళ్లంతా క్రూరులా?” అని.

దీనికి స్పష్టమైన సమాధానం: కాదు.

ఇక్కడ చెప్పబడింది ఎవరినీ తప్పుబట్టడానికి కాదు, భయపెట్టడానికి కూడా కాదు. ఇది ఒక గంభీరమైన ఆధ్యాత్మిక సూత్రాన్ని గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే.

ప్రతి జీవి — అది మనిషైనా, జంతువైనా — బాధను అనుభవిస్తుంది. మనం చేసే ప్రతి చర్యకు ఒక ప్రతిస్పందన ఉంటుంది. దీనినే కర్మ సూత్రం అంటారు.

అంటే ఇది ఒక తీర్పు కాదు, ఒక జ్ఞాపకం.
ఇది ఒక నిషేధం కాదు, ఒక అవగాహన.
ఇది బలవంతం కాదు, మనసుకు ఇచ్చే ఒక ఆహ్వానం.

మనలో చాలా మంది కుటుంబం, సంస్కృతి, అలవాట్ల వల్ల మాంసాహారం తీసుకుంటారు. అది సహజమే. కానీ ఈ బోధ చెప్పేది — మనం చేసే పనిని ఒకసారి సజాగ్రత్తగా గమనించమని.

మన ప్లేట్‌లో ఉన్నది ఎలా వచ్చింది?
దాని వెనుక ఒక జీవితం ఉందా?
అది కూడా బాధను అనుభవించిందా?

ఈ ప్రశ్నలు మనలో సున్నితత్వాన్ని పెంచుతాయి. ఆ సున్నితత్వం మన ఆలోచనలను, నిర్ణయాలను మెల్లగా మార్చవచ్చు — లేదా మార్చకపోవచ్చు కూడా. అది ప్రతి వ్యక్తి ప్రయాణం.

అఘోర తత్వం ఎప్పుడూ బలవంతం చేయదు. అది చెబుతుంది:
“అనుభవించు… అర్థం చేసుకో… మార్పు సహజంగా వస్తుంది.”

కాబట్టి ఈ భాగాన్ని గిల్టీగా ఫీలవ్వడానికి కాకుండా, అవగాహన పెంచుకునే ఒక అవకాశం‌గా చూడండి.


మాయ మనల్ని మోహపరచడం కాదు — మనమే మనల్ని మోహపరుచుకుంటాం. మన కోరికల ప్రకారం ప్రపంచాన్ని చూస్తాం. అందుకే ఎక్కువమంది జీవితం, భోజనం, శరీర ఆనందం చుట్టూ తిరుగుతుంది.


అఘోర మాయా శక్తి తెలుగు – ముగింపు

ఆధ్యాత్మికంగా ఎదగాలంటే తల్లిని (దేవి, అమ్మవారు) మాత్రమే ధ్యానించాలి. ఆమె నిన్ను పరీక్షిస్తుంది, అన్ని ఆకర్షణలు ఇస్తుంది. నువ్వు వాటిని దాటగలిగితే — ఆమె నిన్ను స్వీకరిస్తుంది. ఒకసారి ఆమె తనవాడిగా తీసుకుంటే — ఇక భయం ఉండదు.

ఈ అఘోర “మాయా శక్తి” తెలుగు పోస్ట్ పై మీ సందేహాలను కామెంట్ చేసి తెలియజేయగలరు !

What’s your response?
0 responses
Love
Love
0
Smile
Smile
0
Haha
Haha
0
Sad
Sad
0
Star
Star
0
Weary
Weary
0

Leave a Reply