వేదం - వైదికజీవనం

వేదం తెలియజేసేది అపారము

వేదం తెలియజేసేది అపారము
Views: 1

ఈ నాటి శాస్త్రవేత్తలు అణువులో ఉన్న “గాడ్ ఎలిమెన్ట్” (God Element – Atom) ని కనిపెట్టాము అని ప్రకటించారు. అణువులో ఎన్నో రకాల అంశలు ఉంటాయి, అందులో ఇది దైవ అంశ కావచ్చు అని గమణించారు. అణువులో దైవ  శక్తి ఎట్లా ఉంటుందో మన పూర్వ ఋషులు వివరిస్తూ “అణోరణీయాన్ మహతోమహీయాన్” అని కఠోపనిషద్ చెబుతుంది. ఏది అతి సూక్ష్మమైనదని దర్శించగలుగుతావో దానికి కూడా కారణమై లోన ఉండును. ఏది ఇంత కంటే విశాలమైనది మరొకటి లేదని గుర్తిస్తావో దానికి కూడా ఆవల ఉండి నిలబెట్టును. చిన్న వాటి కంటే చిన్న వాడు, పెద్దవాటి కంటే పెద్దవాడు  అని వేదాలు చెప్పాయి. ఈ నాటి  శాస్త్రవేత్తలు చెప్పేదాంట్లో స్పష్టత లేదు. ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొని అందులో ఉన్న ఒక చిగురు గురించి తెలుసుకొని అంతా తెలిసింది అంటే ఎంత అజ్ఞానమో అదీ అంతే.

భరద్వాజుడివంటి వాడే మూడు పురుష ఆయుషులతో అధ్యయనం చేసినా తాను చేసింది ఒక పెద్ద పర్వతం ముందు ఒక పిడికెడు మాత్రమే అని గుర్తించాడు. ఇలాగా ఈ ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలన్నా, ఈ ప్రపంచానికి కూడా కారణమై ప్రపంచాన్నంతటిని రచన చేసిన భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా ఈ కనిపించే వాటి ద్వారా వెళ్తే లభించేది కాదు. మన శాస్త్రాల్లో న్యాయ శాస్త్రం ఒకటుంది, వాళ్ళు పదార్థాల గురించి పరిశీలన ప్రారంభించారు. ఇది ఎలా తయారయ్యింది, ఎట్లా తయారయ్యింది, ఎందుకిలా ఉంది, మన ప్రయోజనానికి తగట్లు ఎట్లా మలచులోవాలి అని అన్వేషణ ప్రారంభించారు. మన ప్రయోజనం కోసం అంటే శరీరానికా? ఇంద్రియాలకా? మనస్సుకా? ఆ లోని జీవ తత్త్వానికా ? దానికీ వెనకాతల కారణమేమైనా ఉందా? దానికి మనకి మధ్య సంబంధం ఏమి ? ఇలాంటి అంశాలని న్యాయ శాస్త్రం విపులంగా చర్చ చేస్తుంది. దాన్నే తర్కం అంటారు. ఇలా చేసిన విచారణ అన్ని శాస్త్రాలూ చేస్తాయి. వేదాంద శాస్త్రం కూడా ఒక విచారణ చేస్తుంది. కానీ తేడా ఏమిటంటే, ఈ న్యాయ శాస్త్రం క్రిందనుండి వెదకటానికి ప్రయత్నిస్తుంది. కనుక సరియైన అవగాహన ఏర్పడటం శ్రమ సాధ్యం. కానీ వేదాంత శాస్త్రం పైనుంది వివరించడం ప్రారంభిస్తుంది. ‘జగత్ మూలం‘ అంటూ ప్రారంభిస్తుంది. చెట్టు గురించి తెలుసుకోవాలంటే ఆకు ద్వార కంటే గింజ ద్వార తెలుసుకోవడం సులభం.

కనుక వాస్తవాలని తెలుసుకోవలని అనుకున్నప్పుడు తెలుసుకోవాలంటే వేదాన్నే ప్రశ్నించాలి. ప్రశ్నించడం అంటే మనం ఈ నాడు ఏదో ప్రశ్న వేయాలని అర్థం కాదు, ఆ వేదమే ప్రశ్న వేస్తూ సమాధాన రూపంలో తత్త్వ రహస్యాలని తెలుపుతుంది. అసలు వేదం అంటేనే తెలిపేది అని అర్థం. ‘విద్‘ అనే ధాతువునుండి వచ్చే పదం వేదః. ఇతరత్ర మనకు తెలియని వాటిని తెలియజేస్తుంది. తెలివిని కలిగించే సాధనాలు మనకు ఎన్నో ఉన్నాయి. కానీ అలాంటి సాధనాలైన ఇంద్రియాలకు గానీ ఊహకి గానీ అందని వాటిని తెలియజేస్తుంది వేదం.

వేదం తెలియజేసేది అపారము, అంతా తెలుసుకోవడం కన్నా ఏది మన జీవితానికి లక్ష్యము అనే దాన్ని తెలుసుకుంటూ ముందుకుపోవడం ఉత్తమము.

Leave a Reply