జీవితంలో రెండు మార్గాలు (కఠోపనిషత్తు)
శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత
స్తా సంపరీత్యా వివినక్తి ధీరః
శ్రేయోహి ధీరోభి ప్రేయసో వృణీతే
ప్రేయో మందో యోగ క్షేమాత్ వృణీతే!

ఉపనిషత్తుల్లో ఉన్నతంగా భావించే కఠోపనిషత్తులోని నచికేతోపాఖ్యానం చెప్పుకోదగింది. అందులో జిజ్ఞాసతో కూడిన నచికేతుడి ప్రశ్నలకు యముడు బదులిస్తూ… రెండు మార్గాలను ప్రవచించాడు. మొదటిది ‘ప్రేయో’ మార్గమని.. అది సుఖంకరమని, రెండవది ‘శ్రేయో’ మార్గమని. అది శుభంకరమని చెపుతాడు. వీటిలో ఏ మార్గాన్నైనా ఎంచుకునే స్వేచ్ఛ మానవులకు ఉందని పేర్కొన్నాడు.
భౌతిక జీవనంలో ఉన్నతత్వాన్ని సాధించడం, తన మూలాలను అర్థం చేసుకోవడం.. ఈ రెండూ అవసరమైనవే. ఈ క్రమంలో శాస్త్రసాంకేతిక రంగాల్లో వృద్ధిని సాధించడం, సంపదను సృష్టించడం, అందుబాటులో ఉన్న, అనుభవించదగ్గ అన్ని సుఖాలను అనుభవించడం, సంతృప్తికరమైన విధానంలో ఆదర్శప్రాయమైన జీవనాన్ని సాగించడం ప్రేయో మార్గం. ‘నేనెవరు? నా జీవన మూలమేది? భౌతిక జీవనం తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? అక్కడ ఏం చేస్తాను?’ వంటి ప్రశ్నలను వేసుకొని.. వాటికి సమాధానాలను అన్వేషించడమే శ్రేయో మార్గం. సునిశితమైన ఎన్నో ఆవిష్కరణలకు మానవమేధ మూలమై నిలిచింది. మానవాళికి అవసరమైన ఎన్నో ఆవిష్కరణలు చేయడం వల్ల మనిషి సుఖవంతమైన జీవనం గడపగలుగుతున్నాడు. అయితే.. సాంకేతిక ప్రగతి రెండు వైపులా పదునైన కత్తిలాంటిది. దాన్ని ఉపయోగించుకునే వ్యక్తి విజ్ఞతపై ఆధారపడి ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రగతికి మూలమౌతుంది.. అలాగే విధ్వంసానికి నాంది పలుకుతుంది.
విజ్ఞత కరువైన వేళ మానవ విలువలు లోపించి.. సామాజిక నైతికత దెబ్బతింటుంది. దాంతో స్వార్థం పంజా విసురుతుంది. ‘నేనే గొప్ప, నా ఆలోచనే అంతిమం. నా మార్గమే అనుసరణీయం’ అనే భావాలు ఆవిష్కృతమై మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి.
ఇక శ్రేయోమార్గం ఆత్మ మూలాలను అన్వేషించే విధానానికి రూపకల్పన చేస్తూ.. వ్యక్తుల మధ్య అనుబంధాన్ని, సంబంధాన్ని ప్రవచిస్తూ సృష్టికి మూలమైన బ్రహ్మ తత్వజ్ఞానాన్ని ప్రబోధిస్తూ సుగతిని చూపుతుంది. మనుషుల మధ్య భేదం లేదనే విషయం అవగాహనకు వస్తే.. మన మూలాలు ఒకటే అన్న విషయాన్ని గుర్తించ గలిగితే.. మార్గాలేవైనా గమ్యం ఒక్కటే అన్న సత్యం అవగతమైతే.. స్పర్ధాపూర్ణమనస్తత్వాలు మాయమై నేనే అంతటా ఉన్నానని, నాలోనే అంతా ఉన్నదనే భావన అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
ఈ రెండు మార్గాలలోని విశిష్టతను అవగాహన చేసుకోగలిగితే ఏ వ్యక్తీ స్వార్థపూరిత మనస్కుడై, లోక కంటకుడై, ఇతరులను పీడిస్తూ బతకాలని అనుకోడు. భౌతిక సంపదకు తానొక ధర్మకర్తగా అవసరం మేరకు అనుభవిస్తూ శాంతి సౌభాగ్యాలకు చిరునామాగా నిలుస్తాడు. ప్రవృత్తి, నివృత్తి మార్గాలలో ఉన్న భేదాన్ని గుర్తిస్తూ, ఏది శ్రేయస్కరమో దానిని ఆదరిస్తూ, అంతిమ లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో, సాధన చేస్తూ నిరంతర చైతన్య శీలియైు పురోగతి సాధిస్తాడు. ఆ సాధనలో ఆనందాన్ని అనుభవిస్తాడు. పంచుకోవడంలో ఆనందం ఉందనే సత్యాన్ని ఈ ఉపనిషత్ బోధిస్తోంది.
రచన: పాలకుర్తి రామమూర్తి, 9441666943