పురాణంలో ఏముంది?
• సంస్కృతంలో విస్తారమైన సాహిత్యం ఉంది. ఈ సాహిత్యాన్ని వైదిక సాహిత్యం, లౌకిక సాహిత్యం అని రెండు విధాలుగా విభజిస్తారు. వేదాలు, వాటికి సంబందించిన సాహిత్యం అంతా వైదిక సాహిత్యం. తక్కినది లౌకిక సాహిత్యం.
• మనం నాలుగని చెప్పుకుంటున్న వేదాలు అనంతం. వాటిని వర్గీకరించి కూర్చినవాడు వేదవ్యాసుడు. ఈ వ్యాసుడే అష్టాదశ పురాణాలను రచించారు. ఆయన పేరిట గొప్ప సాహిత్యం ఉంది. వ్యాసుడను సాక్షాత్తు “శ్రీమన్నారాయణుడు” అని భావిస్తారు.
• వేదాలు స్వరప్రదానమయిన మంత్రాలతో కూడుకుని ఉంటాయి. వాటి సారాన్ని కధలరూపములో సరళంగా శ్రోతలకు అందించేవే పురాణాలు.
• పురాణం పంచలక్షణాలతో కూడుకున్నది. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, వంశానుచరితం అన్నవి ఆ అయిదు లక్షణాలు. సృష్టి, ప్రళయం, దేవదానవ యుద్దాలు, రాజవంశాల చరిత్ర, మన్వంతరాలలో జరిగిన విషయాలు పురాణంలో ఉంటాయి. బహువిషయాలతో కూడుకొని ఉన్న పురాణాలు ఒక విధంగా ప్రాచీన విజ్ఞాన సర్వస్వాలవంటివి. ఈ పురాణాలను సాత్వికాలు, రాజసికాలు, తామసికాలు అని కూడా విభాగం చేస్తారు.
పురాణం యొక్క లక్ష్యం ఏమిటి?
• రామాయణ భారతాది కావ్యేతిహాసాల లాగా పురాణాలలో ఒకే మౌలిక కధాసూత్రం ఉండదు. బహువిధ విషయాలతో నిండి ఉంటాయి. వేద పురాణ కావ్యాలను వరుసగా ప్రభుసమ్మితాలు, మిత్ర నమ్మితాలు, కా౦తానమ్మితాలు అంటారు. వేదాలు ప్రభువులాగా శాసిస్తాయని, పురాణాలు మిత్రుని లాగా బోధిస్తాయని,
కావ్యాలు ప్రియురాలిలాగా రంజి౦పచేస్తూ ఉపదేశిస్తాయని భావం. అందువల్ల పురాణాలలో కధ ప్రదానం. కధ ద్వారా నీతిని భోదించడం జరుగుతుంది. కావ్యంలో రసం ముఖ్యం.
• సంస్క్రుతపురాణాలైనా, కావ్యేతిహాసాలైనా తెలుగు కవుల చేతుల్లో సౌ౦దర్యవిషయంలో కావ్య లక్షణాన్నే సంతరించుకున్నాయి. సంస్కృతంలో అష్టాదశ పురాణాలూ, అష్టాదశ ఉపపురాణాలూ ఉంటే తెలుగులో వాటిలో కొన్ని కావ్యరూపంలో అనువాదితమయ్యాయి. కొన్నిటిలోని కధలు ఆధారంగా కవులు
కావ్యాలు రచించారు.
• సమాజం వ్యక్తుల మధ్య సంబంధాల మీద, వ్యక్తుల నడవడిమీద ఆధారపడి నడుస్తుంది. పురాణ వాజ్మయం వ్యక్తి నడవడిని, సమాజంలో వర్గాల, వ్యక్తుల సంభందాలను నిర్దేశి౦చడానికి, ప్రతిష్టించడానికి ప్రయత్నిస్తుంది. విభిన్న సామాజిక వర్గాల మధ్య సంబంధాలు, సమాజంలోని వ్యక్తుల మధ్య అంటే, రాజు-ప్రజలు, భార్యాభర్తలు, తల్లితండ్రులు-పిల్లలు, గురుశిష్యులు, బంధుమిత్రులు సంభంధాలెలా ఉండాలో, వాటి ఆదర్శమేమిటో కదారూపంలో నిర్వచించడం పురాణ లక్ష్యం.
|| సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచారితంచైవ పురాణం పంచలక్షణం ||
పురాణముణకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశాములను గురించి పస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో
జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంభ౦దంగా దానిని ప్రతిపాదన చెయ్యగలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేడు.
——————————————————————————
“అష్టాదశ పురానముల” పేర్లను సాదారణ మనుష్యులకు జ్ఞాపకం ఉండడం కోసం అని మన పెద్దలు తేలిక సూత్రము నొక దానిని ప్రతిపాదించారు.
‘మ’ ద్వయం ‘భ’ ద్వయం ‘బ్ర’ త్రయం ‘వ’ చతుష్టయం
‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ ‘స్కా’ ని పురాణాని ప్రుధక్ ప్రుధక్.
ద్వయం అంటే రెండు, త్రయం అంటే మూడు, చతుష్టయమ అంటే నాలుగు అని అర్ధం.
——————————————————————————
మద్వయం – ‘మ’ కారంతో రెండు పురాణములు | మార్కండేయ పురాణము, మత్స్యపురానము.
భద్వయం – ‘భ’ తో రెండు పురాణములు | భాగవత పురాణము, భవిష్య పురాణము.
భ్రత్రయం – ‘బ్ర’ తో మూడు పురాణములు | బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, భ్రహ్మవైవర్త పురాణము.
వచతుష్టయం – ‘వ’ కారంతో నాలుగు పురాణములు | వరాహ, వామన, వాయు, విష్ణు పురాణములు.
అనాపలింగకూస్కా – అన్నప్పుడు ఒకొక్క అక్షరమునకు ఒకొక్క పురాణము వస్తుంది.
అ – అగ్ని పురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగ పురాణము,
గ – గరుడ పురాణము, కూ – కూర్మన పురాణము, స్కా – స్కాంద పురాణము
అనేవి మొత్తం పురాణాల పేర్లు…
“పురాణం”లో ప్రవచన కర్తల కర్తవ్యం ఏమిటి?
• పురాణంలో కధలు కొన్ని చాలా సాధారణంగా కనిపిస్తాయి. మనకు చిరపరిచితంగా అనిపిస్తాయి. కాని వాటి అంతరార్ధం ఆలోచించి తెలుసుకోకుండా అవగతం కాదు. సామాన్య శ్రోతకు అంతసామర్ధ్యం కాని, సావకాశం కాని ఉండకపోవచ్చు. అందువల్ల వాళ్ళకొక మధ్యవర్తి కావాలి. పురాణాన్ని, అంటే పురాణంలోని కధను మాత్రమే కాదు, దానిలోని అంతరార్ధం కూడా శ్రోతలకు అందించవలసిన వ్యాఖ్యాత అవసరమౌతాడు. ఈ భాద్యతను భారతీయ సంప్రదాయంలో పౌరాణికులు, హరికథలు, ప్రవచన కర్తలు పారంపరికంగా నిర్వహించారు.
• పురాణాన్ని ఒక ప్రాచీన కధగా, నాటి ప్రజాజీవన నియమాల నిర్వచన పత్రంగా వ్యఖ్యానించినంత మాత్రాన చేకూరే ప్రయోజనం తక్కువ. దాన్ని నమకాలీన జీవనంలో మానవ సంబంధాల దృష్ట్యా, విలువల దృష్ట్యా నేటి మనిషికి అన్వయించ గలిగినప్పుడే సార్ధక్యం. ఇప్పుడు ఏ విలువలను ఈ సమాజం అనుసరించాలి అన్న విషయం చెప్పగలగాలి. ఆ వైపు ప్రజల నడవడిని తిప్పగాలగాలి. ఇది ప్రవచన కర్త కర్తవ్యం.