తొలి ఏకాదశి విశిష్టత

తొలి ఏకాదశి విశిష్టత

#ఋషివర్య #తొలి_ఏకాదశి_విశిష్టత

అందరికి "తోలి ఏకాదశి" శుభాకాంక్షలు 

వ‌ర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల త‌డిచి, చెరువులు నిండే కాలాన్ని మ‌న పెద్దలు పొలం ప‌నుల‌కు అనువైన స‌మ‌యంగా భావించారు. అందుక‌ని ఆషాఢ‌మాసంలో వ‌చ్చే మొద‌టి ఏకాద‌శిని `తొలి ఏకాద‌శి`గా పేర్కొన్నారు. ఆ రోజున పాలేళ్లని పిలిచి, పొలం పనులని మొదలుపెట్టించేవారు. మ‌రి ఏద‌న్నా సంద‌ర్భాన్ని తీపితో ఆరంభించడం మ‌న అల‌వాటు క‌దా! అందుక‌ని ఆ కాలంలో తేలిక‌గా దొరికే పేలాల‌పిండిని బెల్లంతో క‌లుపుకుని తింటారు. పైగా పేలాలపిండి తినడం వల్ల, ఈ కాలంలో దాడిచేసే కఫసంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతారు.

ఈ ఏకాద‌శిని తొలి అన‌డంలో మ‌రో విశేషం ఉంది. తొలి ఏకాద‌శినుంచే హిందువుల పండుగ‌ల‌న్నీ ప్రారంభం అవుతాయి. వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం, శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, వినాయ‌క‌చ‌వితి.... ఇలా ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కీ ఏదో ఒక ముఖ్యపండుగ వ‌స్తూనే ఉంటుంది. అసలు తొలిఏకాదశినే తొలిపండుగ‌గా కూడా చెప్పుకోవ్చు. సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అంటారు.

ఈ తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాలపాటు పాలకడలిపై యోగనిద్రలోకి జారుకుంటాడని నమ్మకం. అందుకనే ఈ రోజుని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి రాత్రివేళలు మరింత పెరుగుతాయి కాబట్టి, వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించడ సబబే! ఇలా నిదురించిన విష్ణుమూర్తి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు వచ్చే ఉత్థాన ఏకాదశి నాడు మేలుకుని తన భక్తులకు దర్శనమిస్తాడట. ఈ నాలుగుమాసాల పాటూ కొందరు చాతుర్మాస వ్రతం అనే దీక్షను పాటిస్తారు.

ఇక ఏకాదశి అనగానే ఉపవాసం గుర్తుకురాక మానదు. ఆషాఢమాసంలో వచ్చిపడే వర్షాలతోనూ, పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారిపోతుంది. ఇక రాత్రివేళలు పెరిగిపోవడం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో అటు మనసునీ, ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే ఉపవాసం. కనీసం పక్షం రోజులకి ఒకసారైనా ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. కాబట్టి ప్రతి పదిహేను రోజులకి ఓసారి ఉపావాసం చేసే అలవాటుని మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశే సరైన సమయం! మనం ఏదో సాధారణమైన పండుగగా తీసిపారేసే తొలి ఏకాదశి వెనుక ఇన్ని విశేషాలున్నాయన్నమాట!!!