అమ్మ చెట్టు

అమ్మ చెట్టు
అమ్మ చెట్టు

అమ్మ కొంగు పట్టుకుంది చిట్టి. చిట్టికి చిన్న పిలక జడ వుంది కదా, దాన్ని పట్టుకున్నాడు బుజ్జి. ఇంటి పనులతో యిటూ అటూ ఇంజన్లా తిరుగుతోంది అమ్మ. ఆ అక్కాతమ్ముళ్ళిద్దరూ అందమైన రైలు పెట్టెలై అమ్మకు అతుక్కుపోయారు. అమ్మ ఎటువెళ్తే అటు పరుగులు తీస్తున్నారు. 
'కూ..చికు చుకూ..ఊ' .. అని బుజ్జిగాడు రైలు కూతని ఆపడం లేదు: 

'చుక్ చుక్ రైలుబండి వస్తోంది 
దూరం దూరం జరగండి 
ఆగిన తర్వాత ఎక్కండి 
జోజో పాపా యేడవకు 
ఆగిన తర్వాత ఎక్కిస్తా 
లడ్డూ మిఠాయి తినిపిస్తా' 


పాట పాడుకుంటూ రైలు పరిగెడుతోంది. అమ్మ ఇంజను ఆగితే ఆగుతున్నారు. నడిస్తే నడుస్తున్నారు, పరిగెడితే పరిగెడుతున్నారు. 
అప్పుడు అమ్మ ఆగి, అంది..' నేనిప్పుడు బజారుకు వెళ్ళి వస్తాను, మీరిక్కడే స్టేషన్లో వుండండి..' అని! 'మేమో?..' అన్నాడు బుజ్జి వెంట పడబోతూ. 
'పెట్టెలొచ్చేస్తే ఎవరైనా రైలు ఎలా ఎక్కుతారో చెప్పండి.' అని అమ్మ ఒక్కతే అవతలకు వెళ్ళింది. అమ్మకోసం చూస్తూ గుమ్మంలో అక్కా తమ్ముడు ఇంజను లేని పెట్టెల్లా అలాగే నిలబడ్డారు. 
ఎప్పటికీ అమ్మ రాదే?! 
ఇంతలో ఆకాశం గుడగుడమంది. ఉరుము ఉరిమింది మెరుపు మెరిసింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ క్షణకాలం భయపడినా.. మరుక్షణం వీచే గాలితో పాటే చెలరేగి చిందులేసారు. ఎందుకంటే ఎండ వెలుగు పండువెన్నెల వెలుగయి పోయింది మరి! ఆకాశం నిండా మబ్బుల గొడుగు... 
గొడుక్కి చిల్లులు పడ్డట్టు అప్పటికప్పుడు వర్షం మొదలైపోయింది. తుంపర తుంపర్లు చిటుకూ పటుకూ చినుకులయ్యాయి! జాన ఖాళీలేకుండా వాన! 
వర్షంలోకి వెళ్ళబోయాడు బుజ్జి. 
చిట్టి తమ్ముణ్ని ఆపింది. 
'వర్షం పడితే?.! బుజ్జిగాడిది సగం ప్రశ్న. 
'వర్షం పడితే ....నేల తడుస్తుంది. నేల తడిస్తే మొక్కలు మొలుస్తాయి..' మొక్కలు చెట్లయిపోతాయి ' చిట్టి చెప్పిన విషయాలు బుజ్జిగాడికి అర్థం కాలేదు. అందుకే 'ఎవలు?' అన్నాడు. 
'ఇంకెవలు? మా బడుందా? బడిలో సైన్సుందా? సైన్సుకి టీచరుందా? టీచరుకి పాఠముందా? ఆ పాఠంలో ఇదుందా?..' చిట్టి విడమర్చే చెప్పాననుకుంది. 
'ఏది?' బుజ్జిగాడు అడిగాడు. 
'ఇదే.. వర్షంలో తడిస్తే మొక్కవుతుంది ' అంది చిట్టి. 
'ఎవలు?' అన్నాడు బుజ్జి. 
చీకట్లు ముసురుకుంటూ.. వాన ముసుగు కప్పుకుంటూ.. కళ్ళకు ఏమీ కనిపించకుండా వుంది. 
'అమ్మా' అని పిలిచింది చిట్టి. గొంతు బొంగురు పోయింది. దు:ఖం ముంచుకొచ్చి 'అమ్మా' అని యేడ్చింది. అది చూసి బుజ్జిగాడి ముఖం వేళ్లాడిపోయింది. 
వర్షం ఆగదు! 
చిట్టి యేడుపూ ఆగదు! 
'ఊకో అక్కా...' అని బుజ్జి ఆగడు! 
చిట్టి వెక్కి వెక్కి యేడుస్తుంటే లోపల్నుంచి నాన్నారు వచ్చారు. 'ఏమయింది?' అని అడిగారు. 
'అమ్మా..అమ్మా...' మాట రాకుంది చిట్టికి, కళ్ళు జలజలా నీళ్ళు కార్చాయి. 
'అమ్మొస్తుంది చిట్టితల్లీ .. అమ్మొస్తుందమ్మా' అన్నారు నాన్నారు చిట్టిని దగ్గరకు తీసుకొని. 
'అమ్మా వర్షంలో తడిచి పోతుందీ..దీ..ఈ..' యేడుస్తూ చిట్టి. 'ఊకో అక్కా వూకో..' అక్క కళ్ళు తుడుస్తూ బుజ్జి. 'అమ్మ తడిస్తే యేం?' అన్నారు నాన్నారు. 
'అమ్మ తలిస్తే చెత్తయి పోతుందట నాన!, యేం చెత్తు అక్కా?' బుజ్జిగాడి అనుమానం బుజ్జిగాడిది. ఆ మాటతో చిట్టి ఇంకా ఏడ్చింది. దాంతో బుజ్జిగాడూ యేడుపందుకున్నాడు. నాన్నారికి చెప్పే అవకాశం యివ్వలేదు. ఊరడించడమూ వల్ల కాలేదు! జోరున వర్షం.. భోరున ఏడుపు! 

 

ఇంతలో- 
తడిసిపోయి నీళ్ళు కారుతూ అమ్మవచ్చింది. 
చిట్టి ఠక్కున యేడుపు ఆపేసి.. ఒక్క క్షణం అమ్మను కింది నుంచి పైకి చూసింది. మరుక్షణం 'అమ్మా!' అంటూ అమ్మ కాళ్ళను చుట్టేసి ఏడుపు అందుకుంది. 
'ఏమైందమ్మా..?' అర్థం కాని అమ్మ అడుగుతోంది- చిట్టిని చేతులతో ఎత్తి పట్టుకొని. 
నాన్నారు అమ్మతో చిట్టి ఎందుకేడుస్తోందో చెప్పారు. 
అప్పుడు అమ్మ చిట్టిని నేలకు దించి, చిన్నగా నవ్వింది. చిట్టి కళ్ళలోకి చూస్తూ '..లేదమ్మాఁ.. వర్షంలో తడిచి, విత్తులు మొలకలు వేసి, మొక్కలవుతాయి. మనుషులు మొక్కలు కారమ్మా.. నేను చూడు... అమ్మనేఁ... మీ అమ్మనేఁ..' చెప్పింది. 
చిట్టినే చూస్తూ వెన్నెల చిమ్మినట్టు చిన్న నవ్వు నవ్వింది అమ్మ. 
అప్పటికి అనుమానం తీరిన చిట్టీ నవ్వింది. నవ్వుతూ ఏడ్చింది. ఏడుస్తూ అమ్మను చుట్టేసుకుంది. 
నవ్వుతున్న నాన్నారివంక చూస్తూ బుజ్జి కూడా నవ్వాడు. 
'జోజో పాపా ఏలవకు- 
లద్దూ మితాయి తినిపిత్తా...' బుజ్జిగాడి పాటకు అమ్మా నాన్నతోపాటు చిట్టికూడా నవ్వేసింది!